జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై హత్యాయత్నం జరిగింది. శుక్రవారం నారా నగరంలో లిబరల్ డెమొక్రిటిక్ పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తూ స్టేజిపై ప్రసంగిస్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన వేదికపైనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. షింజోకు తీవ్రమైన గాయాలు అయినట్లు సమాచారం. పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. స్థానిక ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో షింజోలో ఎలాంటి కదలికలు లేవని తెలుస్తోంది.
జపాన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా షింజో అబే రికార్డు సృష్టించారు. 2006లో ఆయన తొలిసారిగా జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2007లో అనారోగ్యంతో తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2012లో మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2020 వరకు ఆ పదవిలో కొనసాగారు. షింజో అబేకు భారత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి.