ఆప్ఘాన్‌లో ప్రవాస ప్రభుత్వం.. చట్టబద్దమైన ప్రభుత్వం ఇదే..!
Former Afghanistan officials announce govt in exile.ఆప్ఘాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినట్లు స్విట్జర్లాండ్‌లోని
By అంజి Published on 30 Sep 2021 6:24 AM GMT
ఆప్ఘాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినట్లు స్విట్జర్లాండ్‌లోని ఆప్ఘాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. అష్రఫ్ ఘనీ పాలనలో వైస్ ప్రెసిడెంట్ ఉన్న అమ్రుల్లా సలేహ్ నేతృత్వంలో ప్రవాస ప్రభుత్వం ఏర్పడినట్టు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆప్ ఆప్ఘానిస్తాన్ ప్రకటించింది. ఆప్ఘానిస్తాన్‌లోని ఏకైక చట్టబద్దమైన ప్రభుత్వం ఇదేనని ఆప్ఘాన్ రాయబార కార్యాలయం ప్రకటన జారీ చేసిందని ఖామా ప్రెస్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. తాలిబన్ ప్రభుత్వం గురించి ప్రస్తావిస్తూ.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆప్ఘానిస్తాన్ మాత్రమే ప్రజల ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన చట్టబద్దమైన ప్రభుత్వమని.. ఈ ప్రభుత్వాన్ని ఏ ఇతర ప్రభుత్వం భర్తీ చేయలేదని, ఆప్ఘాన్ తాలిబన్ల ఆక్రమణలో ఉన్నందున పెద్దలతో తగిన సంప్రదింపుల తర్వాత ప్రవాస ప్రభుత్వాన్ని ప్రకటించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆప్ఘాన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. అమ్రుల్లా సలేహ్ ఆప్ఘాన్ దేశానికి నాయకత్వం వహిస్తాడని పేర్కొంది.
అయితే ఈ ప్రకటనలో ప్రవాసంలో ఉన్న మిగతా ప్రభుత్వాధికారులను గుర్తించలేదు. అలాగే మాజీ ఆప్ఘాన్ అధికారులు షంజ్‌షీర్‌లోని అహ్మద్ మసూద్ నేతృత్వంలోని ఉత్తర కూటమికి మద్దతు ప్రకటించారు. ప్రకటన ప్రకారం... ప్రభుత్వం యొక్క మూడు అధికారాలు అయిన ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్, లెజిస్లేటివ్‌లు త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలుపబడింది. అలాగే అన్ని రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లు సాధారణంగానే పని చేస్తాయని పేర్కొంది. కాగా తాలిబన్లు ఆప్ఘాన్ దేశాన్ని అక్రమించుకున్న తర్వాత అనేక మంది ఆప్ఘాన్ అధికారులు దేశం విడిచి పారిపోయారు. కాగా 57 సంవత్సరాల క్రితం ధృవీకరించబడిన మహమ్మద్ జాహిర్ షా కాలం నాటి రాజ్యాంగాన్ని తాత్కాలికంగా స్వీకరిస్తామని తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగతున్నారు.