ఆ దేశంలో కాఫీ రూ.7 వేలు, కేజీ అరటిపండ్లు రూ.3336
Food crisis in North Korea.కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా అతలాకుతలం అయ్యింది.
By తోట వంశీ కుమార్ Published on 20 Jun 2021 2:31 PM ISTకరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా అతలాకుతలం అయ్యింది. ఇప్పటికి ఇంకా ఈమహమ్మారి నుంచి తేరుకోనేలేదు. ఈ మహమ్మారి కారణంగా పేద, అల్పాదాయ దేశాలు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని పలు అంతర్జాతీయ నివేదికలు అంచనా వేయగా.. ప్రస్తుతం అవి నిజం అవుతున్నాయి. ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార కొరత ఎదుర్కొంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తొలిసారి అధికారికంగా అంగీకరించారు. దేశంలో ఆహార కొరత తీవ్రంగా ఉందని, ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారని ఆయన అన్నారు. కిందటి ఏడాది తుఫానుల కారణంగా తగినంత ధాన్యం ఉత్పత్తి కాలేదని.. వీటి నుంచి బయటపడేందుకు ఆహార ఉత్పత్తులను గణనీయంగా పెంచే మార్గాలను కనుగోనాలని అధికారులను ఆదేశించారు.
ఉత్తర కొరియాలో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఉత్తర కొరియా వార్తా సంస్థ ఎన్‌కె న్యూస్ ప్రకారం.. ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో ఓ చిన్న బ్లాక్ టీ ప్యాకెట్ ధర 70 డాలర్లు (5,167రూపాయలు). ఇక కాఫీ ప్యాకెట్ ధర అయితే వెయ్యి డాలర్లకు పైగానే(7,381 రూపాయలు) ఉంది. ఇక ఒక కిలో అరటిపండ్ల ధర 45 డాలర్లుగా ఉంది. అంటే ఇక్కడ 3300 రూపాయలన్నమాట. మహా అయితే కిలోకు ఒక ఆరేడు అరటిపండ్లు మాత్రమే వస్తాయి. ఈ ధరలే చెబుతున్నాయి ఆదేశంలో ఏ రీతిలో ఆహారసంక్షోభం ఉందో చెప్పడానికి.
ఈ స్థాయిలో ఆర్థిక సంక్షోభం ఏర్పడడానికి రెండు కారణాలు ఉన్నాయి. కరోనా కారణంగా దేశ సరిహద్దులు మూసివేయడం అందులో ఒకటి. సరిహద్దులు మూసివేయడంతో చైనాతో వాణిజ్య సంబంధాలు తగ్గిపోయాయి. చైనా నుంచి ఆహారం, ఎరువులు, ఇంధనం వంటివి ఉత్తర కొరియా భారీగా దిగుమతి చేసుకుంటుంది. ఇక అణ్వాయుధాలను కలిగి ఉన్న కారణంగా అంతర్జాతీయ సమాజం విధించిన ఆంక్షలు రెండవ కారణం. దీంతో ఉత్తర కొరియోలో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది.
ఇక ఈ ఏడాది మొత్తం మీద ఉత్తర కొరియా 13 లక్షల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటోందని దక్షిణ కొరియా ప్రభుత్వ సంస్థ అంచనా వేస్తోంది. అదే సమయంలో ఐక్యరాజ్య సమితి ఆహార విభాగం కూడా తన అంచనాను వెల్లడించింది. దాదాపు 8 లక్షల 60వేల టన్నుల ఆహార కొరతను ఉత్తర కొరియా ఎదుర్కొంటోందని స్పష్టం చేసింది.