అఫ్గాన్‌లో ఆకలి కేకలు తప్పవు : ఐక్యరాజ్యసమితి
Food agency warns of hunger in Afghan conflict.అఫ్గానిస్థాన్ తాలిబన్ల వశం అయిన సంగతి తెలిసిందే. దీంతో
By తోట వంశీ కుమార్ Published on 20 Aug 2021 11:04 AM ISTఅఫ్గానిస్థాన్ తాలిబన్ల వశం అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశంలోని ప్రజలు ప్రాణాలను గుప్పిటలో పెట్టుకుని బతుకుతున్నారు. ఆ దేశం విడిచి వెళ్లేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే.. హృదయం ద్రవీంచక మానదు. తాలిబన్ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అమెరికా.. తమ దేశంలోని అఫ్గనిస్థాన్ నిధులను స్తంబింప చేసింది. ఇక అఫ్గానిస్థాన్‌కు ప్రస్తుతం ఎటువంటి రుణాలు ఇవ్వబోమని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) తెలిపింది. కొత్త ప్రభుత్వాన్ని అన్ని దేశాలు గుర్తించి.. స్పష్టత ఇచ్చే వరకు ఆర్థిక సాయంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని చెప్పింది.
దీంతో మరికొన్ని రోజుల్లో అఫ్గానిస్థాన్ కు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టనున్నాయి. ఇదిలా ఉంటే.. అనిశ్చితి పరిస్థితుల కారణంగా అఫ్గాన్‌లో ఆకలి కేకలు తప్పవని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. 1.4 కోట్ల మందికి తినడాకిని తిండి కూడా దొరకదని అంచనా వేసింది. ఇప్పటికే కరోనా వైరస్‌తో కుదేలైపోయిన ఆ దేశంలో తాజాగా నెలకొన్న సంక్షోభంతో ప్రజలపై తీవ్రమైన ఆర్థిక, సామాజిక ప్రభావం కనిపిస్తుందని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్స్‌కి చెందిన అఫ్గాన్ డైరెక్టర్ మేరి ఎలన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 40 శాతానికి పైగా పంటలు సరిగా పండలేదని, నిల్వ ఉన్న ఆహార ధాన్యాలు నాశనమయ్యాయని చెప్పారు.
పెద్ద సంఖ్యలో పశువులు మృత్యువాత పడగా.. తాలిబన్ల రాకతో వేలాది మంది చెల్లాచెదురయ్యారు. ఇల్లను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. బయట ఎక్కడ ఆహారం దొరకడం లేదన్నారు. మే నెలలో 40 లక్షల మంది ఆకలిని తీర్చామని, వచ్చే కొద్ది నెలల్లో 90 లక్షల మంది కడుపు నింపాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నప్పటికీ ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని మేరి ఎలన్ తెలిపారు. ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునైనా ఈ ఆకలి సంక్షోభాన్ని నివారించాలంటే కనీసం 20 కోట్ల అమెరికా డాలర్లు అవసరం అవుతాయని అంచనా వేసింది.