టీచ‌ర్‌ను కొట్టిన స్టూడెంట్.. బలంగా తోసేసి పిడిగుద్దులు కురిపిస్తూ దాడి

పాఠ‌శాల‌లో వీడియో గేమ్ ఆడుతున్న విద్యార్థి నుంచి వీడియో గేమ్ ట్యాబ్ ను ఉపాధ్యాయురాలు తీసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2023 11:46 AM IST
టీచ‌ర్‌ను కొట్టిన స్టూడెంట్.. బలంగా తోసేసి పిడిగుద్దులు కురిపిస్తూ దాడి

టీచ‌ర్‌ను కొట్టిన స్టూడెంట్


ఒక‌ప్పుడు గురువుల‌ను పూజించేవారు. అయితే ఇప్పుడు కొంద‌రు విద్యార్థులు ఏకంగా చ‌దువు చెప్పే గురువుల‌పైనే దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. పాఠ‌శాల‌లో వీడియో గేమ్ ఆడుతున్న విద్యార్థి నుంచి వీడియో గేమ్ ట్యాబ్ ను ఉపాధ్యాయురాలు తీసుకుంది. అంతే ఆగ్ర‌హంతో ఊగిపోయిన ఆ విద్యార్థి స‌ద‌రు ఉపాధ్యాయురాలిపై దాడికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న ఫ్లోరిడాలో చోటు చేసుకుంది.

ఫ్లాగ్లర్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. మతంజాస్ హైస్కూల్‌లో 17 ఏళ్ల ఓ విద్యార్థి చ‌దువుకుంటున్నాడు. క్లాస్ రూమ్‌లో స‌ద‌రు విద్యార్థి వీడియో గేమ్ ఆడుతుండ‌డంతో అసిస్టెంట్ టీచ‌ర్‌(టీచ‌ర్స్ ఎయిడ్‌) ఆ వీడియో గేమ్ ట్యాబ్‌ను తీసుకుంది. అంతే ఆ విద్యార్థి కోపంతో ఊగిపోయాడు. వీడియో గేమ్ ట్యాబ్ తీసుకుని బ‌య‌ట‌కు వ‌స్తున్న ఆమెను వెన‌క నుంచి తోసేశాడు.

అల్లంత దూరంలో ఆ టీచ‌ర్ ఎగిరి ప‌డింది. దీంతో స్పృహ కోల్పోయింది. అయిన‌ప్ప‌టికి స‌ద‌రు విద్యార్థి కోపం చ‌ల్లార లేదు. ఆమె వీపు భాగంలో పిడిగుద్దులు కురిపిస్తూ దాడి చేస్తూనే ఉన్నాడు. చుట్టు ప‌క్క‌ల వారు వ‌చ్చి ఆ విద్యార్థిని ప‌ట్టుకున్నారు. ఈ త‌తంగం మొత్తం అక్క‌డి సీసీ కెమెరాల్లో రికార్డైంది.

స్టూడెంట్ దాడిలో గాయ‌ప‌డిన టీచ‌ర్‌ను ఆస్ప‌త్రికి తీసుకువెళ్ల‌గా ప‌క్క‌టెముక‌లు విరిగిన‌ట్లు గుర్తించి వైద్యం అందించారు. ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసిన పోలీసులు స‌ద‌రు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఇది హ‌త్య లాంటిదే. ఎవ‌రినైనా అలా కింద‌కు తోసిన‌ప్పుడు, వారి త‌ల‌ను నేల‌ను తాకిన‌ప్పుడు జ‌రిగే ఫ‌లితాన్ని ఊహించ‌లేం అని ఓ అధికారి చెప్పారు.

Next Story