భారీ వ‌ర్షాలు.. నీట‌మునిగిన 'ఐఫోన్ సిటీ'.. 12 మంది మృతి

Floods Rage Through World's Biggest iPhone Production Centre.చైనాలో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2021 6:31 AM GMT
భారీ వ‌ర్షాలు.. నీట‌మునిగిన ఐఫోన్ సిటీ.. 12 మంది మృతి

చైనాలో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హెన‌న్ ప్రావిన్స్‌ను భారీ వ‌ర్షాలు ముంచెత్తాయి. ఎన్న‌డూ లేనంత‌గా రికార్డు స్థాయిలో కుంభ‌వృష్టి కుర‌వ‌డంతో భీక‌ర వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. రోడ్లు, ఇళ్లు, షాపింగ్ మాల్స్, రైల్వే ట్రాకులు ఇలా అన్నీ వరద నీటిలోనే మునిగాయి. ఈ వ‌ర‌ద‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 12 మంది మృతి చెందిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ల‌క్ష‌మందికి పైగా ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ఈ ప్రాంతం అనేక వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక. చైనా అతిపెద్ద ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌ కూడా ఇక్కడే ఉంది.

కాగా.. గ‌త‌ శనివారం నుంచి ఇక్క‌డ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. 'ఐఫోన్‌ సిటీ'గా పిలిచే ప్రావిన్స్‌ రాజధాని జెంగ్జౌలో మంగళవారం ఒక్కరోజే 457.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శనివారం నుంచి ఇక్కడ సగటున 640.8 మి.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత 1000ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి అని అక్కడి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జెంగ్జౌ నగరం జలదిగ్బంధమైంది. ఆ నగరంలో ఎటుచూసినా వరద నీరే కనిపిస్తోంది. గత 24 గంటల్లో ఆ నగరంలో 457.5 మిమి వర్షపాతం నమోదైంది. ఈ వరదల ప్రభావం 12 ప్రధాన నగరాలపై పడింది. రహదారులను మూసేశారు. విమాన సర్వీసులూ రద్దయ్యాయి. 9.4 కోట్ల జనాభా ఉన్న హెనన్​ ప్రావిన్సులో ప్రభుత్వం అత్యంత ప్రమాదకర వాతావరణ హెచ్చరికలను జారీ చేసింది.

Next Story