పది అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఐదుగురు మరణించగా.. శిథిలాల కింద 80 మంది వరకు చిక్కుకున్నారు. ఈ ఘటన ఇరాన్ దేశంలోని అబాడాన్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఇరాన్‌లోని అబాడాన్ నగరంలోని అమీర్ కబీర్ వీధిలో ఉన్న ఓ 10 అంతస్తుల భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. భవనం శిథిలాల కింద 80 మంది వరకు చిక్కుకున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటి వరకు 30 మంది వరకు రక్షించారని, మిగతా వారిని శిథిలాల కింద నుంచి బయటకు తీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు రెస్క్యూ డాగ్‌లు, హెలికాప్టర్, ఏడు రెస్క్యూ వాహనాలను ఇప్పటికే సంఘటనా స్థలంలో మోహరించినట్లు తెలిపింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ 10 అంతస్తుల భవనంలో నివాస సముదాయాలతో పాటు బిజినెస్ సెంటర్ కోసం నిర్మాణం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఖుజెస్తాన్ ప్రావిన్స్ న్యాయవ్యవస్థ అధిపతి దర్యాప్తుకు ఆదేశించారు. భవన యజమాని, దాన్ని నిర్మించిన కాంట్రాక్టర్‌ను అరెస్టు చేసినట్లు ఇరాన్ అధికారులు చెప్పారు. కాగా.. భవనం కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.