66 మంది ప్రయాణీకులతో బయలు దేరిన ఈజిప్టు ఎయిర్ విమానయాన సంస్థకు చెందిన ఓ విమానం తూర్పు మధ్యధరా సముద్రంలో కూలిపోయింది. ఆరేళ్ల క్రితం మే 2016లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో దీనిని ఉగ్రదాడిగా అనుమానించగా.. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వివరాల్లోకి వెళితే.. మే 2016లో పారిస్ నుంచి ఈజిప్ట్ రాజధాని కైరోకు ఈజిప్ట్ ఎయిర్ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఎ320 బయలుదేరింది. గ్రీక్ ద్వీపాలకు 130 నాటికల్ మైళ్ల దూరంలో ఈ విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. అనంతరం క్రెటె ద్వీపం సమీపంలో తూర్పు మధ్యధరా సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమాన సిబ్బంది సహా 66 మంది జలసమాధి అయ్యారు. అప్పట్లో దీన్ని ఉగ్రదాడిగా ఈజిప్టు అధికారులు ప్రకటించారు. అయితే.. ఏ ఉగ్రముఠా కూడా దీనికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.
ఈ విమాన ప్రమాదంపై ఫ్రెంచ్ ఏవియేషన్ అధికారులు విచారణ ప్రారంభించారు. భారీ గాలింపు చేపట్టి సముద్ర గర్భంలో విమాన బ్లాక్ బాక్స్‌ను గుర్తించి వెలికి తీశారు. దర్యాప్తు సంబంధించిన 134 పేజీలతో కూడిన ఓ నివేదికను గల నెలలో పారిస్‌లోని అప్పీల్ కోర్టులో సమర్పించారు. ఈ వివరాలపై న్యూయార్క్ పోస్ట్ తాజాగా ఓ కథనం ప్రకటించింది.
కాక్‌పిట్‌లోని ఫైలట్ సిగరేట్ వెలిగించగానే అత్యవసర మాస్క్ నుంచి ఆక్సిజన్ లీక్ అయి మంటలు చెలరేగాయని తెలిపింది. ఫలితంగా విమానం కుప్పకూలిందని దర్యాప్తు అధికారులు నివేకదలో వెల్లడించినట్లు పేర్కొంది. మంటలు అంటుకున్న సమయంలో కాట్‌పిట్‌లోని సిబ్బంది భయంతో అరుస్తున్న శబ్దాలు మాస్క్‌కు ఉన్న మైక్రోఫోన్‌లో రికార్డ్ అయ్యాయని దర్యాప్తులో వెల్లడైంది.