ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు అగ్నిప్రమాదాలు భయపెడుతున్నాయి. తాజాగా ఇరాక్‌లోని ఓ కరోనా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 23 మంది రోగులు సజీవ దహనం కాగా.. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. అక్కడి అధికారులు తెలిపిన వివరాల మేరకు.. రాజధాని బిగ్దాద్ శివార్లలోని ఇబ్న్ అల్-ఖతిబ్ దవాఖానలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఆదివారం తెల్లవారుజామున పెద్ద శబ్దం చేస్తూ.. ఆక్సిజన్ ట్యాంక్ పేలింది. దీంతో ఆస్పత్రిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగ బిల్డింగ్‌లో వ్యాపించింది. మంటలు, పొగ కారణంగా కొంత మంది బయటకు రాలేకపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో ఐసీయూలో 30 మంది రోగులు ఉన్నట్లు వెల్లడించారు. ఆస్పత్రిలో రోగులు, వారి సంబంధీకులు మొత్తం 120 మంది ఉన్నారని.. వారిలో 90 మందిని రక్షించామని తెలిపారు. 23 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మంది వరకు గాయపడ్డారన్నారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించామని తెలిపారు.
ఇరాక్‌లో ఫిబ్రవరి నుండి కరోనావైరస్ మహమ్మారి విరుచుకుపడుతోంది. ఈ వారంలో మొత్తం ఒక మిలియన్ కేసులు దాటిపోయాయి. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి మొత్తం 1,025,288 కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15,217 మరణించినట్లు ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది