నియంత్రణ కోల్పోయిన చైనా రాకెట్.. భూమిపై పడనుందా..!
Falling Chinese rocket to crash to Earth.చైనా గతవారం లాంగ్‌మార్చ్ 5బి అనే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి కోర్ మాడ్యూల్‌ను విజయవంతంగా పంపింది. ఇప్పుడా రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమి చుట్టూ తిరుగుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 6 May 2021 5:40 AM GMTచైనా తనకంటూ ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకొనే ప్రయత్నం లో భాగంగా గతవారం లాంగ్‌మార్చ్ 5బి అనే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి కోర్ మాడ్యూల్‌ను విజయవంతంగా పంపింది. అయితే ఇప్పుడా రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమి చుట్టూ తిరుగుతోంది. దాని శకలాలు సముద్రంలో కాకుండా భూమిపై పడే ప్రమాదం ఉందని అంతరిక్ష నిపుణులు హెచ్చరిస్తుండడంతో ఇప్పుడు జనం బేంబేలెత్తి పోతున్నారు.
లాంగ్ మార్చి 5 బి రాకెట్ ఏప్రిల్ 29న హైనాన్ ద్వీపం నుంచి టియాన్హే మాడ్యూల్‌ను ప్రయోగించింది. 2022 నాటి కల్లా సొంతంగా ఓ స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ శాశ్వత చైనీస్ అంతరిక్ష కేంద్రంలో ముగ్గురు సిబ్బందికి నివాసంగా మారనుంది. అయితే ఈ రాకెట్ గతవారం పేలిపోయింది. ఈ శకలాలు నెల 8న ఆ రాకెట్ భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉందని అమెరికా రక్షణ విభాగ అధికార ప్రతినిధి మైక్ హావర్డ్ వెల్లడించారు. రాకెట్ శకలాలు భూమిపై కచ్చితంగా ఎక్కడ పడతాయనే విషయాన్ని చెప్పలేమని, భూవాతావరణంలోకి ప్రవేశించడానికి కొన్ని గంటల ముందు మాత్రమే ఆ విషయాన్ని చెప్పగలమని నిపుణులు చెబుతున్నారు.
రాకెట్ బరువు 22 టన్నులు కావడంతో ప్రమాదం స్థాయి ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. అయితే రాకెట్.. రీ ఎంట్రీ సమయంలో భూ వాతావరణంలోకి ప్రవేశించగానే చాలావరకు శిధిలాలు కాలిపోతాయి కాబట్టి భూమిపైకి చాలా చిన్న భాగం మాత్రమే వచ్చే అవకాశం ఉందని మరికొంతమంది నిపుణులు చెబుతున్నారు. దీంతో రాకెట్ శకలాలు భూమిపై పడే అవకాశాలు చాలా స్వల్పమని, అంతర్జాతీయ సముద్ర జలాల్లో పడే అవకాశాలే ఎక్కువని స్పష్టం చేశారు.
కాగా, గతేడాది 'లాంగ్‌మార్చ్ 5బి'ని తొలిసారి ప్రయోగించినప్పుడు దాని శకలాలు ఐవరీ కోస్ట్‌పై పడి పలు గ్రామాల్లోని ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతానికి కాలిఫోర్నియాలోని 18వ అంతరిక్ష నియంత్రణ స్క్వాడ్రన్ మే 4 నుంచి రాకెట్ శిధిలాలు పడిన స్థానం గురించి ఎప్పటికప్పుడూ అప్ డేట్స్ అందిస్తుందని పేర్కొంది. చైనా సొంత అంతరిక్ష పర్యవేక్షణ నెట్‌వర్క్ రాకెట్ ఫ్లైట్ కోర్సు పరిధిలోని ప్రాంతాలను నిశితంగా గమనిస్తుంది. ప్రయాణిస్తున్న నౌకలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటుంది. లాంగ్ మార్చి 5బి రాకెట్ లో ఉపయోగించిన ఇంధనం.. పర్యావరణ అనుకూల ఇంధనమని, అది సముద్రాన్ని కలుషితం చేయదని నిపుణులు భావిస్తున్నారు.