రొమాంటిక్‌ స్కామ్‌: ఐ లవ్‌ యూ చెప్పి.. వృద్ధురాలిని బురిడీ కొట్టించిన నకిలీ వ్యోమగామి

Fake Astronaut Cheats A Woman In The Name A Love. 'నేను ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో ఉన్నా.. నీపై మనసు పడ్డా.. తిరిగి భూమి మీదకు రాగానే నిన్ను పెళ్లి చేసుకుని

By అంజి  Published on  12 Oct 2022 4:12 AM GMT
రొమాంటిక్‌ స్కామ్‌: ఐ లవ్‌ యూ చెప్పి.. వృద్ధురాలిని బురిడీ కొట్టించిన నకిలీ వ్యోమగామి

'నేను ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో ఉన్నా.. నీపై మనసు పడ్డా.. తిరిగి భూమి మీదకు రాగానే నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం నీతోనే ఉంటా. అయితే నేను రావడానికి టికెట్‌ కొనాలి. దాంతో పాటు మీ దేశం రావడానికి రాకెట్‌ కూడా కావాలి. ఇందుకు కొంచెం డబ్బు కావాల్సి ఉంటుంది. ఆ డబ్బు నువ్వు పంపావంటే ఆ తర్వాత మనం హ్యాపీగా జీవించవచ్చు'.. అంటూ ఓ వృద్ధురాలిని నకిలీ వ్యోమగామి తన బుట్టలో పడేశాడు. అతడి మాటలు నమ్మిన ఆ వృద్ధ మహిళ.. అతడికి రూ.25 లక్షల వరకు పంపించింది. ఈ ఘటన జపాన్‌ దేశంలో వెలుగు చూసింది.

65 ఏళ్ల వృద్ధ మహిళకు సోషల్‌ మీడియాలో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే అతడు తాను రష్యాకు చెందిన వ్యోమగామినని, ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు. తన సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో అన్నీ స్పేస్‌ నుంచి తీసిన అంతరిక్ష ఫొటోలు పోస్టు చేశాడు. ఇవన్నీ చూసిన ఆ వృద్ధురాలు నిజమేనని నమ్మేసింది. ఇలా కొన్ని రోజుల వరకు వారి స్నేహం కొనసాగింది. జపాన్‌లో ఎక్కువగా యూజ్‌ చేసే మెసేజింగ్‌లో చాట్‌ చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నకిలీ వ్యోమగామి ఆ మహిళ ముందు పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ప్రేమిస్తున్నానని, భూమీ మీదకు రాగానే మ్యారేజ్‌ చేసుకుంటానంటూ మాయమాటలు చెప్పాడు.

అయితే తిరిగి భూమీ మీదకు రావాలంటే చాలా డబ్బు ఖర్చవుతుందని, జపాన్‌కు వెళ్లగలిగే రాకెట్‌కు ల్యాండింగ్ ఫీజు చెల్లించాలంటూ, ఐ లవ్ యూ అని చెప్పి ఆమెను నమ్మించాడు. అతను పంపిన మెసేజ్‌లతో మహిళ మనసు కరిగి పోయింది. ఆ మాటలు నమ్మిన ఆమె ఐదు దఫాలుగా సుమారు రూ.25 లక్షలు పంపించింది. ఈ డబ్బు తీసుకున్న అతను తిరిగి రాకపోగా.. మరింత డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో మహిళకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ ఘటనను రొమాంటిక్ స్కామ్‌గా కేసు నమోదు చేసుకున్న జపాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story