ప్రయాణికులకు అలర్ట్..దుబాయ్‌కు అన్ని ఫ్లైట్స్ రద్దు చేసిన ఎమిరేట్స్
ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎమిరేట్స్ ప్రయాణికులకు షాకిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది
By - Knakam Karthik |
ప్రయాణికులకు అలర్ట్..దుబాయ్‌కు అన్ని ఫ్లైట్స్ రద్దు చేసిన ఎమిరేట్స్
ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థ ఎమిరేట్స్ ప్రయాణికులకు షాకిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దుబాయ్‌కు వెళ్లే మరియు అక్కడి నుంచి బయలుదేరే అన్ని విమాన సర్వీసులను తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయినందున ప్రయాణికులు ఎవరూ విమానాశ్రయానికి రావొద్దని సంస్థ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా గట్టిగా విజ్ఞప్తి చేసింది. ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని, ప్రస్తుత అంతరాయం పట్ల ప్రయాణికులు సహనం వహించాలని ఎమిరేట్స్ కోరింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, తదుపరి అప్‌డేట్స్ త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేసింది.
విమానాల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం ఎమిరేట్స్ ఫ్లెక్సిబుల్ ట్రావెల్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 31 మధ్య టికెట్లు బుక్ చేసుకున్న వారు ఏప్రిల్ 30వ తేదీలోపు తమ ప్రయాణాన్ని రీబుక్ చేసుకోవచ్చని సూచించింది. ఒకవేళ ప్రయాణాన్ని పూర్తిగా రద్దు చేసుకోవాలనుకుంటే రిఫండ్ సౌకర్యం కూడా కల్పించింది. నేరుగా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్న వారు ఆన్‌లైన్‌లో రిఫండ్ ఫారం నింపవచ్చని, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకున్న వారు నేరుగా తమ ఏజెంట్లనే సంప్రదించాలని స్పష్టం చేసింది.
ఇదే క్రమంలో దుబాయ్‌లోని అన్ని సిటీ చెక్-ఇన్ సదుపాయాలను కూడా తదుపరి నోటీసు ఇచ్చే వరకు మూసివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. విమాన కార్యకలాపాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందేందుకు ప్రయాణికులు తమ బుకింగ్ ప్రొఫైల్‌లో కాంటాక్ట్ వివరాలను సరిచూసుకోవాలని ఎయిర్‌లైన్ సూచించింది.