బిట్ కాయిన్.. ఎంటర్ అయిన ఎలాన్ మస్క్
Elon Musk's Tesla invests $1.5 billion in bitcoin cryptocurrency. ఎలక్ట్రిక్ కార్ల గ్లోబల్ దిగ్గజం టెస్లా డిజిటల్ కరెన్సీ బిట్‌కాయిన్‌లో 1.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడంతో బిట్ కాయిన్ హవా మరింతగా పెరగనుంది.
By Medi Samrat Published on 10 Feb 2021 8:18 AM IST
బిట్ కాయిన్.. 2008లో ప్రపంచ దేశాలను అల్లాడించిన ఆర్థిక మాంద్యం టైంలోనే క్రిప్టో కరెన్సీ పేరిట బిట్ కాయిన్ అనే డిజిటల్ కరెన్సీ వెలుగు చూసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి కనబరుస్తున్న అంశం ఇది. ఒకానొకప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి లక్ బాగా కలిసొచ్చింది. ఎప్పటికప్పుడు బిట్ కాయిన్ ధర పెరుగుతూ ఉంది. తాజాగా ఎలక్ట్రిక్ కార్ల గ్లోబల్ దిగ్గజం టెస్లా డిజిటల్ కరెన్సీ బిట్‌కాయిన్‌లో 1.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడంతో బిట్ కాయిన్ హవా మరింతగా పెరగనుంది. టెస్లా కంపెనీ త్వరలో ఈ డిజిటల్ కరెన్సీని చెల్లింపులకూ అనుమతించే ప్రణాళికల్లో ఉంది. టెస్లా బిట్ కాయిన్ లోకి ఎంటర్ అవుతోందని తెలియగానే సోమవారం ఉదయం బిట్‌కాయిన్ విలువ 15 శాతం పెరిగింది. ఏకంగా 44,000 డాలర్లను తాకింది. హైఎండ్ వాహనాల కొనుగోలుకి బిట్‌కాయిన్‌లో చెల్లింపులను అనుమతించే ఆలోచనలో ఉన్నట్లు టెస్లా చెప్పడంతో బిట్ కాయిన్ ధర మరింత పెరిగింది. డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులపై ఆటో దిగ్గజం టెస్లా.. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజీకి వివరాలు దాఖలు చేసింది.
క్రిప్టో కరెన్సీగా పేరొందిన బిట్ కాయిన్‌లో అత్యధిక పెట్టుబడులు పెట్టిన సంస్థగా టెస్లా నిలిచింది. బిట్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొనడంతో ట్రేడింగ్‌లో బిట్ కాయిన్ విలువ 15 శాతం పెరిగిపోయింది. తద్వారా దాని విలువ 44 వేల డాలర్లకు పెరిగిపోయింది. గరిష్ఠ స్థాయిలో బిట్ కాయిన్ విలువ పెరుగడం ఇదే మొదటిసారి.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో క్రిప్టో కరెన్సీ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ రూపాయికి డిజిటల్ వర్షన్ తేవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటించిన కొన్ని రోజులకే అనురాగ్ ఠాకూర్ బిట్ కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీలపై ఇంతకుముందు ఉన్న వైఖరినే భారత్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. బిట్ కాయిన్ తదితర క్రిప్టో కరెన్సీలు చట్ట విరుద్ధం అని పేర్కొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రసంగంలో అప్పటి ఆర్థిక మంత్రి జైట్లీ మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీలను లీగల్ టెండర్‌గా గుర్తించబోమన్నారు. వాటి వాడకాన్ని పూర్తిగా తొలగించి వేస్తామని చెప్పారు.