ట్విట్టర్ ఆఫీసులోకి మస్క్ ఇలా ఎంట్రీ ఇచ్చాడేమిటబ్బా..!
Elon Musk Now "Chief Twit" Visits Twitter Office With A Sink.ఎలాన్ మస్క్ తన బయోని "చీఫ్ ట్వీట్" గా మార్చుకున్నాడు.
By తోట వంశీ కుమార్
ట్విట్టర్ సోషల్ నెట్‌వర్క్ సైట్‌ను 44 బిలియన్ డాలర్లకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కొనుగోలు చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రక్రియ శుక్రవారం నాటికి పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే ఎలాన్ మస్క్ తన బయోని "చీఫ్ ట్వీట్" గా మార్చుకున్నాడు. అనంతరం శాన్ ఫ్రాన్సిస్‌కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశాడు.
ఆ వీడియో అందరిని ఆశ్చర్యపరిచింది. మస్క్ ఓ సింక్‌ను మోసుకుంటూ ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చాడు. "ట్విట్టర్ హెడ్‌క్వార్టర్స్‌లోకి ఎంటర్ అవుతున్నా.. ఇక అది సింక్ కావాల్సిందే" అని మస్క్ తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
Entering Twitter HQ – let that sink in! pic.twitter.com/D68z4K2wq7
— Elon Musk (@elonmusk) October 26, 2022
ఆ వీడియోలో మస్క్.. సింక్ మోస్తూ తాను మునిగిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పడం కనిపిస్తుంది.
మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలనే తన నిర్ణయాన్ని ఏప్రిల్‌లో ఎలాన్ మస్క్ ప్రకటించాడు. అప్పటి నుంచి ఈ డీల్ ముగింపు దశకు చేరుకునే వరకు అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
జూలైలో స్పామ్ మరియు నకిలీ బాట్ ఖాతాల సంఖ్యను తప్పుగా సూచించడం ద్వారా ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మస్క్ ఆరోపించారు. డీల్ ను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. అయితే.. ట్విట్టర్ మస్క్‌పై దావా వేసింది. మళ్లీ మస్క్ మనసు మారడం ఇలా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తం 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను మస్క్ సొంతం చేసుకుంటున్నారు.