ఇజ్రాయెల్‌లో తొక్కిసలాట.. 40 మంది మృతి
Dozens killed in stampede at Israel pilgrimage site.ఇజ్రాయెల్‌లోని ఓ పుణ్యక్షేత్రంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 40 మంది మృతి.
By తోట వంశీ కుమార్
ఇజ్రాయెల్‌లోని ఓ పుణ్యక్షేత్రంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 40 మందికి పైగా మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ఇజ్రాయెల్‌లోని లాగ్ బొమర్ ఫెస్టివల్ సందర్భంగా ఒక పవిత్ర సమాధి వద్ద 30 వేల మందికి పైగా యూదులు గుమికూడారు. వీరిలో కొంతమంది ఓ స్టేడియంపైకి ఎక్కారని, అది ఒక్కసారిగా కుప్ప కూలిందని సమాచారం. ఈ సంఘటనలో సుమారు 103 మందికి పైగా గాయపడ్డారని క్షతగ్రాతులను తరలించేందుకు దాదాపు అయిదు వందలకు పైగా బస్సులను వినియోగించారని స్థానిక మీడియా తెలిపింది.
స్టేడియం నుంచి కిందికి దిగేందుకు వందలాది మంది ప్రయత్నించడంతో పెద్దఎత్తున తొక్కిసలాట జరిగినట్టు ఇజ్రాయెల్ స్టేట్ మీడియా తన అధికారిక ట్విట్టర్ లో పేర్కొంది. మృతదేహాలను తరలించే అవకాశలు లేక అక్కడే తెల్లని టార్పాలిన్ తో కప్పి ఉంచారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాలకంటే ముందు గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించేందుకు ఎమర్జెన్సీ, అత్యవసర సర్వీసులను వినియోగించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సానుభూతి తెలిపారు. ఈ ఘటనను అత్యంత దారుణమైనదిగా పేర్కొన్నారు.
క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, అలాగే తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశించారు. లాగ్ బొమర్ ఘటన పట్ల పలు దేశాలు విచారం ప్రకటించాయి. రెండవ శతాబ్దానికి చెందిన ఒక యోగి సమాధి ని దర్శించటానికి.. ఏటా 10 వేల మందికి అనుమతి ఇస్తారు. గతేడాది కరోనా కారణంగా ఈ వేడుక జరగక పోవడంతో ఈ సారి అత్యధికంగా 650 బస్సులు యాత్రికులతో వచ్చినట్లుగా తెలుస్తోందని.. సుమారు 30 వేల మందికి పైగా భక్తులతో ఆ ప్రాంతం కిక్కిరిసి పోయిందని చెబుతున్నారు.
ఇజ్రాయెల్ కరోనాను జయించామని , ఇక మాస్కుల అవసరం కూడా లేదని ప్రకటించుకున్న తరువాత ప్రభుత్వం అంగీకరించిన అతి పెద్ద బహిరంగ కార్యక్రమం ఇది. ఈ కారణంగానే సుమారు 5 వేలమంది పోలీసులను మొహరించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పినప్పటికి ఈ విధంగా జరగటం అక్కడి ప్రభుత్వానికి సైతం విస్మయానికి గురి చేసింది.