యుద్ధ ఖైదీలను నిర్భందించిన జైలుపై రాకెట్ దాడి జరిగింది. ఈ ఘటనలో 53 మంది యుద్ధ ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 75 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి చేపట్టిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ను హస్తగతం చేసుకునేందుకు రష్యా దళాలు పోరాడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పట్టుబడిన ఉక్రెయిన్ సైనికులను రష్యా అనుకూల వేర్పాటువాదుల ఆధీనంలోని ఒలెనివ్వా నగరంలోని జైలులో ఉంచింది.
అయితే.. శుక్రవారం ఈ జైలుపై రాకెట్ దాడి జరిగింది. ఆ సమయంలో జైలులో మొత్తం 193 మంది ఖైదీలు ఉన్నట్లు రష్యా మద్దతున్న వేర్పాటు వాద నాయకుడు డెనిస్ పుషులిన్ తెలిపారు. వీరిలో 53 మంది మరణించారు. మరో 75 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 8 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. అయితే.. జైలులో ఎంత మంది ఉక్రెయిన్ సైనికులు ఉన్నారు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఈ ఘటనపై ఉక్రెయిన్, రష్యా పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. అమెరికా రాకెట్ లాంఛర్లతోనే ఉక్రెయిన్ బలగాలు ఈ దాడి చేశాయని రష్యా ఆరోపించింది. ఘటన జరిగిన ప్రాంతంలో అమెరికా తయారీ రాకెట్ విడిభాగాలను కనుగొన్నట్లు తెలిపింది. అయితే ఈ ఆరోపణలను ఉక్రెయిన్ ప్రభుత్వం ఖండించింది. రష్యా సేనలు ఉద్దేశపూర్వకంగానే దాడి చేసి.. తమపై నిందను మోపుతున్నారని ఆరోపించింది. ఆ జైలులో ఉక్రెయిన్ సైనికులను చేసిన చిత్రహింసలను, హత్యలను మరుగునపడేసేందుకే రష్యా ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు తెలిపింది.