ర‌ష్యాలో ఘోర ప్రమాదం.. బొగ్గు గ‌నిలో 52 మంది మృతి

Dozens dead in Siberia coal mine accident.ర‌ష్యాలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ బొగ్గు గ‌నిలో గ్యాస్ లీక్ కావ‌డంతో భారీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Nov 2021 11:30 AM IST
ర‌ష్యాలో ఘోర ప్రమాదం.. బొగ్గు గ‌నిలో 52 మంది మృతి

ర‌ష్యాలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ బొగ్గు గ‌నిలో గ్యాస్ లీక్ కావ‌డంతో భారీ పేలుళ్లు సంభ‌వించాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు రక్షకులతో సహా ఇప్పటి వరకు 52 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న వాయవ్య సైబీరియాలోని కెమెరొవో ప్రాంతంలో ఉన్న‌ ఓ బొగ్గుగ‌నిలో గురువారం చోటు చేసుకుంది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో గ‌నిలోప‌ల దాదాపు 285 మంది ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు. వీరిలో 52 మంది మృతి చెందగా.. మ‌రో 35 మంది గ‌ల్లంత‌య్యారు. మిగిలిన వారిని ర‌క్షించిన‌ట్లు వెల్ల‌డించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన 44 మందిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. వీరిలో న‌లుగురు ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. దాదాపు 820 అడుగుల లోతులో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

ఇక‌ గ‌ల్లంతైన వారు కూడా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం చాలా త‌క్కువ అని అధికారులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ సంతాపం తెలిపారు. క్ష‌తగాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కెమెరోవో ప్రాంతంలో శుక్ర‌వారం నుంచి ఆదివారం వ‌ర‌కు మూడు రోజుల పాటు సంతాప దినాల‌ను ర‌ష్యా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కాగా.. ఎలాంటి భద్రతా నిబంధనలను పాటించక పోవడంతోనే ప్ర‌మాదం జ‌రిగింద‌ని అక్క‌డి మీడియా వెల్ల‌డించింది. మైన్ డైరెక్టర్ సహా ఇద్దరు సీనియర్ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలిపింది.

Next Story