కుక్క కు మంకీపాక్స్.. యజమానుల వల్లే
Dog reportedly contracts Monkeypox from owners.మొన్నటి వరకు కరోనా మహమ్మారి భయపెట్టగా ఇప్పుడు మంకీపాక్స్
By తోట వంశీ కుమార్ Published on 17 Aug 2022 1:31 PM ISTమొన్నటి వరకు కరోనా మహమ్మారి భయపెట్టగా ఇప్పుడు మంకీపాక్స్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చాలా దేశాల్లో మంకీపాక్స్ కేసులు భారీగా నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే.. ఇప్పటి వరకు ఈ వైరస్‌ను మనుషుల్లోనే గుర్తించారు. తాజాగా ఓ కుక్కకు ఈ వైరస్ సోకినట్లు నిర్థారించారు ఫ్రెంచ్ పరిశోధకులు. ఈ వివరాలను మెడికల్ జర్నల్ ది లాన్సెట్‌లో ప్రచురించారు. ఇద్దరు స్వలింగ సంపర్కుల(గే) నుంచి కుక్కకు ఈ వైరస్ సోకింది.
ఇద్దరు స్వలింగ సంప్కరుల్లో మంకీపాక్స్ వైరస్ గుర్తించగా వారితో పాటు నిద్రించిన కుక్కకు ఈ వైరస్ సోకినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. వారిద్దరికి మంకీపాక్స్ లక్సణాలు కనిపించిన 12 రోజుల తరువాత వారి వద్ద ఉంటున్న నాలుగేళ్ల ఇటాలియన్ గ్రేహోండ్ కుక్కలో ఆ లక్షణాలు గుర్తించారు. కాగా.. కుక్క కు గతంలో ఎలాంటి అనారోగ్యం లేదు. పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది.
స్వలింగ సంపర్కుల్లో ఒకడైనా లాటినోకి స్కిన్ అల్సర్ ఉంది. అతడి వద్దే పడుకోవడం వల్లే కుక్కకు వైరస్ వచ్చినట్లు గుర్తించారు. లాటినో, కుక్క నుంచి సేకరించిన మంకీపాక్స్ వైరస్ డీఎన్ఏలను పరీక్షించగా.. మనిషి, కుక్కలో ఒకే రకమైన (hMPXV-1) వైరస్ ఉన్నట్లు తేల్చారు. దీన్ని B.1 లీనియేజ్‌గా గుర్తించారు. కాగా.. పెంపుడు జంతువులకు మనుషుల నుంచి సోకిన తొలి కేసు ఇదే. ఇంతక ముందు ఎలుకలు, అడవి మృగాల్లో నిర్థారణ అయింది. అమెరికాలోని వ్యాధుల నియంత్రణ నివారణ కేంద్రం(సీడీసీ) ప్రకారం పెంపుడు జంతువులకు మంకీపాక్స్ సోకితే 21 రోజుల పాటు దూరంగా ఉండాలని సూచించింది.