త‌గ్గిన‌ బైడన్.. భారత్‌కు సహాయానికి సిద్ధం

Joe Biden helps to India Covid surge. భారత్‌కు, అక్కడి ఆరోగ్యశాఖ సిబ్బందికి ఎటువంటి సహాయం కావాలన్నా వెంటనే చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అని అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటించారు.

By Medi Samrat  Published on  26 April 2021 3:07 AM GMT
Joe Biden

కరోనా విలయ విధ్వంసంతో అల్లాడుతున్న భారత్ కు అండగా ఉండేందుకు శత్రు దేశాలుగా పేరున్న పాకిస్తాన్, చైనా కూడా ముందుకు వచ్చాయి. కానీ అమెరికా మాత్రం తన వైఖరితో విస్మయానికి గురి చేసింది. భారత్ కు సాయం చేయడానికి అగ్రరాజ్య అధ్యక్షుడు జోబైడెన్ చొరవ చూపకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. గతేడాది అమెరికా కరోనాతో అల్లాడిపోతోంటే ఇండియా ముందుకు వ‌చ్చి అత్యంత కీలకమయిన హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి అగ్రరాజ్యానికి సాయం చేసినా.. ఇప్పుడు అమెరికా మాత్రం ఆ ప‌ని చేయ‌క‌పోవ‌డంపై బైడెన్ ప్ర‌భుత్వం విమ‌ర్శ‌లు ఎదుర్కొంది.

అమెరికా స్టోరేజ్‌లో ఉన్న కోట్లాది ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల‌తోపాటు అవ‌స‌రమైన ఇత‌ర కొవిడ్ మందుల‌ను కోవిడ్ సెకండ్ వేవ్ తో విలవిలలాడుతున్న భారత్,బ్రెజిల్ వంటి దేశాలకు స‌ర‌ఫ‌రా చేయాల‌ని యూఎస్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌తోపాటు అక్క‌డి చ‌ట్ట‌స‌భ‌ల ప్ర‌తినిధులు బైడెన్ ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.. ప్రజలనుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో అమెరికా దిగి వ‌చ్చింది. నష్ట నివారణ చర్యలు చేపట్టింది. భారత్‌కు, అక్కడి ఆరోగ్యశాఖ సిబ్బందికి ఎటువంటి సహాయం కావాలన్నా వెంటనే చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అని అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటించారు. అటు వైట్‌హౌజ్ నేష‌నల్ సెక్యూరిటీ అడ్వైజ‌ర్ జేక్ స‌ల్లివాన్ కూడా దీనిపై స్పందించారు.

ఇండియాలో కొవిడ్ ప‌రిస్థితుల‌పై అమెరికా తీవ్ర ఆందోళ‌న చెందుతోందనీ, కొవిడ్‌పై పోరాడుతున్న ఇండియాకు మ‌రింత సాయం చేయ‌డానికి 24 గంట‌లూ శ్ర‌మిస్తున్నామ‌ని అన్నారు. మరోవైపు, కరోనా వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడిసరుకుల ఎగుమతిపై అమెరికాలో నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అయితే నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఇటీవల విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన బైడెన్‌ ప్రభుత్వం.. భారత ఔషధాల్ని అర్థం చేసుకోగలమని వ్యాఖ్యానించింది. భారత్‌కు కావాల్సిన ముడిపదార్థాలను పంపే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించింది. తాజాగా అందుకు అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది.

కరోనా టీకా కొవిషీల్డ్‌ తయారీలో అవసరమయ్యే ముడి పదార్థాలను తక్షణమే భారత్‌కు పంపుతామని అమెరికా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారుజేక్‌ సలీవన్‌, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌కు తెలియజేశారు. అలాగే, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, నిర్ధారణ పరీక్షల కిట్లు, ఆక్సిజన్‌ ప్లాంట్లు-సంబంధిత పరికరాలనూ పంపేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపింది.

Next Story