Video : ల్యాండింగ్ స‌మ‌యంలో బోల్తా ప‌డ్డ విమానం.. ఒక్క సారి ఆ వీడియోలు చూస్తే..

కెనెడా టొరంటోలోని పియర్సన్ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయింది.

By Medi Samrat  Published on  18 Feb 2025 9:10 AM IST
Video : ల్యాండింగ్ స‌మ‌యంలో బోల్తా ప‌డ్డ విమానం.. ఒక్క సారి ఆ వీడియోలు చూస్తే..

కెనెడా టొరంటోలోని పియర్సన్ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 18 మంది గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. విమానం నేలపై ల్యాండ్ అవుతున్న స‌మ‌యంలో బోల్తాపడింది.

మిన్నియాపాలిస్ నుండి వస్తున్న డెల్టా విమానం ప్ర‌మాదానికి గురైన‌ట్లు అధికార వ‌ర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో 76 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. విమానాశ్రయ సిబ్బంది ట్విట్టర్‌లో సమాచారాన్ని పోస్ట్ చేసింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదం జరిగిన తర్వాత విమానంలో ఉన్న వ్యక్తులు తీసిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచుతో నిండిన ఉపరితలంపై విమానం తలకిందులుగా ప‌డివుండ‌టం వీడియోలో చూడవచ్చు.

ఈ ప్రమాదంలో విమానం రన్‌వేపై బోల్తా పడిందని, అయితే ఎవరూ చనిపోలేదని అధికారులు తెలిపారు. విమానం బోల్తా పడటానికి కారణమేమిటో చెప్పడం క‌ష్ట‌మ‌ని, వాతావరణమే కార‌ణ‌మై ఉండవచ్చని పేర్కొన్నారు.

కెనడియన్ వాతావరణ విభాగం తెలిపిన‌ ప్రకారం.. విమానాశ్రయంలో మంచు కురుస్తోంది. గంటకు 52 కిలోమీటర్ల నుండి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దాదాపు మైనస్ 8.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

విమానం కూలి మంచుతో నిండిన రన్‌వేపై జారిపోయిందని విమానంలోని ప్రయాణికుడు కోకోవ్ తెలిపారు. అప్పుడు విమానంలో 80 మంది ఉన్నారు.. అంద‌రూ ఎలాగోలా శిథిలాల నుండి బయటకు వచ్చారు. ప్రాణాలతో బయటపడిన కోకోవ్ కూడా ఈ ఘోర ప్రమాదాన్ని వీడియో తీసి.. 'ఈరోజు జీవించి ఉండటం గొప్ప అనుభూతినిస్తోంది' అని క్యాప్షన్ పెట్టాడు. తాను మహిళా పైలట్ సహాయంతో ప్రమాదం జరిగిన తర్వాత విమానం నుంచి బయటకు రాగలిగానని కోకోవ్ తెలిపాడు. బయటకు వెళ్లాలని, వీడియోలు తీయవద్దని, ఫోన్‌లను దూరంగా ఉంచాలని మహిళా పైలట్‌ పదే పదే చెబుతున్నారని కోకోవ్‌ తెలియజేశాడు.

విమానం బోల్తా ప‌డిన‌ వెంటనే ప్రయాణికులందరిలో భయాందోళనలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన తర్వాత విమానంలో సీటు బెల్టుతో ఉన్న‌ మహిళను ఓ వ్యక్తి వీడియో తీశాడు. అందులో ఆమె తలక్రిందులుగా వేలాడదీయబడిన‌ట్లు క‌న‌ప‌డింది. తనను తాను విడిపించుకోలేకపోవ‌డంతో.. అక్కడ ఉన్న ప్రజలు ఆమెకు సహాయం చేశారు.

Next Story