భయపెడుతున్న బ్యాక్టీరియా.. పెరుగుతున్న కేసులు
అమెరికాలోని తూర్పు తీర ప్రాంతాల్లో 'విబ్రియో వల్నిఫికస్' బ్యాక్టీరియా కేసులు పెరగడం కలవర పెడుతోంది. వాతావరణ మార్పుల
By అంజి Published on 12 April 2023 9:00 AM ISTభయపెడుతున్న బ్యాక్టీరియా.. పెరుగుతున్న కేసులు
అమెరికాలోని తూర్పు తీర ప్రాంతాల్లో 'విబ్రియో వల్నిఫికస్' బ్యాక్టీరియా కేసులు పెరగడం కలవర పెడుతోంది. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర జలాలు వేడెక్కుతుండటంతో ఈ బ్యాక్టీరియా కేసులు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ బ్యాక్టీరియా చాలా డేంజర్.. ఎందుకంటే ఇది మానవ కణజాలాన్ని తినేస్తుంది. దీంతో మనిషి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ మధ్యకాలంలో ఈ బ్యాక్టీరియా కేసులు పెరుగుతుండటంతో స్థానిక ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. శరీరానికి తగిలిన గాయాలపై విబ్రియో వల్నిఫికస్ వృద్ధి చెందుతుందని అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) వెల్లడించింది.
గాయం తగిలిన చోట నెమ్మదిగా కణజాలాన్ని తినేస్తుంది. దీంతో గాయం మరింత పెద్దదిగా అవుతుంది. కొన్ని సార్లు బాధితులను అత్యవసర చికిత్స గది (ఐసీయూ)లో ఉంచాల్సి వస్తుంది. సీడీసీ ప్రకారం.. ఈ వ్యాధి సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరు చనిపోయే అవకాశం ఉంది. కొన్ని విబ్రియో వల్నిఫికస్ ఇన్ఫెక్షన్లు నైక్రోటైజింగ్ ఫాసిటిస్‌కు దారి తీస్తాయని సీడీసీ వెల్లడించింది. గాయం చుట్టూ ఉన్న కణజాలాన్ని బ్యాక్టీరియా తినడం వల్ల, ఆ గాయం మరింత పెద్దదిగా మారి ప్రాణహాని కలిగే ఛాన్స్ ఉందని సీడీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే ఈ బ్యాక్టీరియా సాధారణ, చల్లని వాతావరణ పరిస్థితుల్లో మనుగడ సాగించలేదు. వేడి ఎక్కువగా ఉన్న చోట మాత్రమే ఈ బ్యాక్టీరియా చురుగ్గా ఉంటుంది. వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్న అమెరికా తీర ప్రాంతంలో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతోంది. 1988 నుంచి 2016 మధ్య కాలంలో అమెరికాలో 1100 మంది ఈ వ్యాధి బారినపడగా 156 మంది ప్రాణాలు కోల్పోయారు. 2050 నాటికి ఈ బ్యాక్టీరియా న్యూజెర్సీ, న్యూయార్క్ నగరాలకు విస్తరించే అవకాశం ఉందని ది మెట్రో పత్రిక తెలిపింది.