సిరియాలో విషాదం చోటు చేసుకుంది. రాజధాని డమాస్కస్ ప్రాంతంలో మిలటరీ బస్సులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో 27 మంది గాయపడ్డారని సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పేలుడు సమాచారం అందుకోగానే వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన సైనికులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కాగా.. పేలుడు గల కారణాలు ఇంత వరకు తెలియరాలేదు. తామే ఈ దారుణానికి పాల్పడినట్లు ఏ సంస్థ బాధ్యత వహించలేదు. దశాబ్ద కాలంలో సిరియా దేశంలో ఘర్షణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ మృతుల సంఖ్యను 17గా పేర్కొంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పింది.