తీవ్ర విషాదం.. హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట.. 151 మంది మృతి
Crowd crush kills at least 151 at Seoul Halloween festivities.సియోల్‌లో నిర్వహించిన హాలోవీన్ వేడుకలు తీవ్ర విషాదాన్ని
By తోట వంశీ కుమార్ Published on 30 Oct 2022 7:54 AM ISTదక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో నిర్వహించిన హాలోవీన్ వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. తొక్కిసలాట కారణంగా ఇప్పటి వరకు 151 మంది మరణించారు. మరో 150 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో చాలా మంది గుండెపోటుకు గురి కాగా.. మరికొందరు ఊపిరి తీసుకునేందుకు చాలా అవస్థలు పడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. అక్కడ ఇటీవల కరోనా ఆంక్షల్ని సడలించడంతో దాదాపు లక్ష మంది వరకు హాలోవీన్ వేడుకల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
Seoul Halloween stampede | Death toll rises to 151 including 19 foreigners from Iran, Uzbekistan, China and Norway, reports Yonhap news agency
— ANI (@ANI) October 30, 2022
ప్రతి సంవత్సరంలాగానే ఈ సారి హాలోవీన్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి ఇటావాన్‌లో ఓ ఇరుకైన వీధి గుండా వేల సంఖ్యలో ప్రజలు వెలుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కొందరు ఊపిరి ఆడక చనిపోగా.. మరికొందరు స్పృహ తప్పి పడిపోయారు.
సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు.పదుల సంఖ్యలో ఒకరిపై ఒకరు పడిపోయి అపస్మారక స్థితిలో ఉన్న వారికి ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రులకు తరలించారు. దాదాపు 400 మంది అత్యవసర సిబ్బందిని, 140 వాహనాలను రంగంలోకి దించి సహాయక చర్యలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అక్కడ భయానక వాతావరణం కనిపిస్తోంది. ఊపిరాడని పరిస్థితుల్లో రోడ్లపై పడి ఉన్న వారిని స్ట్రెచర్లపైకి చేరుస్తూ కొందరు, అత్యవసర గుండె చికిత్సలు అందిస్తూ మరికొందరు కనిపిస్తున్నారు. ఆ ప్రాంతం అంతా పోలీసులు, అంబులెన్స్ వాహనాలతో నిండిపోయింది. ఇంకా కొన్ని మృతదేహాలు రోడ్డుపైనే పడి ఉన్నాయి.
ఈ ఘటనపై దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
సెలబ్రెటీ రావడంతోనే..!
ఇరుకు వీధిలోని ఇటెనొన్ బార్‌కు ఓ సినీతార వచ్చిందనే సమాచారంతో అక్కడకు వెళ్లేందుకు ఒక్కసారే చాలా మంది ప్రయత్నించడమే ఈ దారుణానికి కారణమని స్థానిక మీడియా తెలిపింది. కాగా.. ఇప్పటి వరకు మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడలేదు.