కరోనా వైరస్ కు పుట్టినల్లు అయిన చైనాలో ఈ మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. వైరస్ కట్టడి చేశామన్న ఆనందం అధికారుల్లో ఎక్కువ రోజులు నిలవలేదు. చైనాలోని గాంజావ్ సిటీలో కొత్త రకం స్ట్రెయిన్ భయటపడింది. స్ట్రెయిన్‌లతో పోల్చితే ఈ స్ట్రెయిన్ మరింత ప్రమాదకరమైనదని, చాలా ఉద్దృతంగా ఉంటుందని అధికారులు అంటున్నారు. 1.5 కోట్ల మంది నివాసముండే గాంజావ్ సిటీలో గత వారం రోజుల్లో 20 మందిలో ఈ కేసులు బయటపడడంతో అధికారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ అందరూ ఇళ్లలోనే ఉండాలని ఆదేశించినట్లు గ్లోబల్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో రాసుకొచ్చింది.
శనివారం లివాన్ జిల్లాలో కొత్త వేరియంట్‌ను కనుగొనేందుకు ప్రభుత్వం పరీక్షలకు ఆదేశించింది. జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో ప్రజలకు పరీక్షలు నిర్వహించనుంది. బహిరంగ మార్కెట్లు, శిశు సంరక్షణ కేంద్రాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, రెస్టారెంట్లపై నిషేదం విధించింది. బహిరంగ కార్యక్రమాలను పరిమితం చేయాలని లివాన్‌కు చుట్టుపక్కల నాలుగు జిల్లాల అధికారులను ఆదేశించింది. తమ దేశంలో కరోనాను కట్టడి చేశామంటూ గొప్పగా చెప్పుకుంటున్న ఈ సమయంలో మళ్లీ పదుల సంఖ్యలో కరోనా కేసులు విజృంభిస్తుండడంతో చైనాలో ఆందోళన కలిగిస్తోంది.