కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రపంచ దేశాలు చాలా కష్టాలే పడుతూ ఉన్నాయి. కరోనాను ఎదుర్కోవడంలో ఎంతో గందరగోళం ఉందని.. మనుషుల అలసత్వాన్ని బట్టి చూస్తే మహమ్మారి అంతానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పటిష్ఠమైన వైద్యారోగ్య చర్యల ద్వారా కొన్ని నెలల వ్యవధిలో దీన్ని నియంత్రించగలమని.. ఈ ఏడాది తొలి రెండు నెలల గణాంకాలు చూస్తేనే అర్థమవుతుందని అన్నారు. ఇక ఆ రెండు నెలల్లో మరణాలు, కొత్త కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయని.. దీంతో వైరస్‌ను నియంత్రించగలమని, వేరియంట్లను అడ్డుకోగలమన్న విషయం స్పష్టమైందన్నారు.గత ఏడు వారాలుగా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని టెడ్రోస్ తెలిపారు. ప్రస్తుతం కీలక దశలో ఉన్నామని అన్నారు. గత వారంలో కేసుల సంఖ్యలో 9 శాతం.. మరణాల్లో 5 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. కొన్ని దేశాల్లో కరోనా విజృంభిస్తున్నప్పటికీ ఇంకా నైట్ క్లబ్‌లు, రెస్టారెంట్లు, మార్కెట్లు జనాలతో కిటకిటలాడుతున్నాయని అన్నారు. ప్రజల్లో అలసత్వం పోవాలని అన్నారు.
కరోనా సోకి కోలుకున్నాక కూడా ఎన్నో సమస్యలు మొదలవుతూ ఉన్నాయని పరిశోధనల్లో తెలుస్తోంది. కరోనా సోకి కోలుకున్న బాధితుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు నాడీ సమస్యలు లేదా మానసిక జబ్బుల బారినపడుతున్నారని.. కరోనా సోకిన ఆరు నెలల్లోనే ఏకంగా సుమారు 34 శాతం మందిపై ఆ ప్రభావం కనపడిందని అంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న 17 శాతం మందిలో ఆందోళన.. 14 శాతం మందిలో మూడ్ మారిపోయే సమస్యలు ఎదురవుతున్నాయని.. 13 శాతం మంది మొట్టమొదటిసారి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. మెదడులో రక్తస్రావం 0.6 శాతం, పక్షవాతం 2.1 శాతం, మతిమరుపు 0.7 శాతం మందిలో కనపడుతున్నాయని పరిశోధనల్లో తేలింది. ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల కన్నా కరోనా చాలా ప్రమాదకరమని పరిశోధకులు తెలిపారు. ఫ్లూతో పోల్చి చూస్తే కరోనా ప్రభావం వల్ల నాడి, మానసిక సమస్యల ముప్పు 44 శాతం అధికంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.