ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఓ వైపు యుద్ధం జరుగుతుంటే.. మరో వైపు ఉక్రెయిన్‌లోని ఒడెసా నగరంలోని బాంబ్ షెల్టర్‌లో ఓ జంట పెళ్లి చేసుకుంది. పెళ్లి బాజాల మధ్య జరగాల్సిన వారి పెళ్లి.. వైమానిక దాడుల సైరన్ మధ్య జరిగింది. ఉక్రెయిన్ దేశంపై పూర్తి స్థాయి దండయాత్ర ప్రారంభించిన రష్యా దళాలు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో క్షిపణి దాడులు చేస్తోంది. రష్యా తమ దేశంలో దాడులు కొనసాగిస్తున్న సమయంలో ఈ జంట ఒక్కటయ్యారు. ఒక బెలారసియన్ మీడియా సంస్థ.. వివాహ వేడుక నుండి వధువు చిరునవ్వుతో, పువ్వులు పట్టుకుని ఉన్న చిత్రాలను పంచుకుంది. అయితే వరుడు ఈ సందర్భాన్ని జరుపుకోవడానికి ఒక పత్రంపై సంతకం చేసి బ్రెడ్ ముక్కలను పంచుకోవడం చూడవచ్చు.
ఇదిలా ఉంటే అంతకుముందు రోజు.. ఉక్రేనియన్ అధికారులు రష్యా సైనికులు దక్షిణ నగరమైన ఖెర్సన్‌ను స్వాధీనం చేసుకున్నారని ధృవీకరించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన 8వ రోజు ఖేర్సన్ నగరం రష్యా నియంత్రణలోకి వచ్చింది. ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ షెల్లింగ్, బాంబు దాడులు, వీధి పోరాటాల మధ్య, ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుండి 2,000 మందికి పైగా పౌరులు మరణించినట్లు పేర్కొంది.