పేలిన అగ్నిపర్వతం.. ముంచుకొస్తున్న లావా

Congo's Mount Nyiragongo volcano erupts forcing thousands to evacuate. కాంగోలోని ఇరగోంగో అనే ఒక పురాతన అగ్నిపర్వం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బద్దలైంది.

By Medi Samrat  Published on  23 May 2021 11:27 AM GMT
Mount Nyiragongo volcano

కాంగోలోని ఇరగోంగో అనే ఒక పురాతన అగ్నిపర్వం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బద్దలైంది. అగ్ని పర్వతం విస్ఫోటనంతో లావా ఉప్పొంగుతోంది. దీంతో చుట్టుపక్కల ఎరుపురంగులోకి మారింది. లావా ధారలుగా ప్రవహిస్తూ గోమా నగరంలోని ప్రధాన రహదారులపైకి చేరింది. దీంతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. జనాలు గుంపులు గుంపులుగా గోమా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. 1977 లో ఇదే పర్వతం విస్ఫోటన వల్ల సుమారు 6 వందల మంది మరణించారు. అలాగే 2002లో జరిగిన విస్పోటనలో సుమారు 3 వందల మంది మృతి చెందారు.

ఇప్పుడు తాజాగా శనివారం రాత్రి మరోసారి అగ్నిపర్వతం బద్దలవడంతో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. అయితే అగ్నిపర్వతం పేలుడుతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది. కొందరు కివు సరస్సు పడవల్లో, మరికొందరు మెట్రోపాలిటన్‌ ప్రాంతంలోని ఎత్తయిన పర్వత ప్రాంతాలకు చేరుకున్నారు. ఇప్పటి వరకు సుమారు మూడువేల మంది ప్రజలు కాంగోను విడిచి వెళ్లినట్లు రువాండా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు భారత బ్రిగేడ్ ప్రధాన కార్యాలయం గోమా ఎయిర్ ఫీల్డ్ కి ఆనుకొని ఉందనిఅయితే దానికి వచ్చిన ప్రమాదం ఏమి లేదని ఆర్మీ అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల వచ్చిన లావా ఎక్కువగా రువాండా వైపు ప్రవహించిందని, చాలా కొద్దిగా మాత్రమే గోమా వైపు వెళ్లినట్టుగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి శాంతి భద్రత బృందం కూడా అప్రమత్తం అయ్యింది. తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది.
Next Story