రైల్వే స్టేషన్‌లో పూలు అమ్మిన బ్రిటన్‌ ప్రధాని రిషి.. వీడియో వైరల్‌

Commuters surprised as UK PM Rishi Sunak sells poppies at London tube station. రైల్వే స్టేషన్‌లో పూలు అమ్మిన బ్రిటన్‌ ప్రధాని రిషి.. వీడియో వైరల్‌

By అంజి  Published on  4 Nov 2022 1:43 PM IST
రైల్వే స్టేషన్‌లో పూలు అమ్మిన బ్రిటన్‌ ప్రధాని రిషి.. వీడియో వైరల్‌

ఇటీవలే బ్రిటన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ రైల్వే స్టేషన్‌లో పూలు అమ్ముతూ కనిపించారు. గురువారం నాడు లండన్‌ సబ్‌వే స్టేషన్‌లో ప్రధాని రిషి.. పూలు విక్రయిస్తూ ప్రత్యక్షమయ్యారు. ఇది చూసిన ప్రయాణికులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. కార్యాలయాలకు వెళ్తున్న ఉద్యోగులు, ఇతరులకు వెస్ట్‌ మినిస్టర్‌ ట్యూబ్‌ స్టేషన్‌లో ప్రధాని రిషి సునాక్‌ ఓ బాక్స్‌లో పూలు అమ్ముతూ కనిపించడంతో వారంత షాకయ్యారు. పేపర్‌తో తయారు చేసిన పూలను ఒక్కోటి 5 పౌండ్లకు ప్రధాని విక్రయించారు.

రాయ‌ల్ బ్రిటిష్ లెజియ‌న్ వార్షిక లండ‌న్ పాపీ డే అప్పీల్‌కు నిధుల సేక‌ర‌ణ నిమిత్తం ప్రధాని రిషి.. ఈ పూల‌ను అమ్ముతూ క‌నిపించారు. ఈ ఈవెంట్‌కు నిధుల సేక‌ర‌ణ‌కు బ్రిటిష్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వాలంటీర్లతో పాటు బ్రిట‌న్ ప్ర‌ధాని సైతం వారితో పాలుపంచుకున్నారు. ప్ర‌ధాని రిషి కనిపించడంతో.. ఆయనతో స‌న్నిహితంగా మెలుగుతూ ఉత్సాహంగా సెల్పీలు తీసుకున్నారు. దేశ ప్ర‌ధానితో తాము గ‌డిపిన క్ష‌ణాల‌ను కొంద‌రు త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

"ప్రధానమంత్రి రిషి సునాక్‌.. ఈరోజు ఉదయం నేను పనిలోకి వెళుతున్నప్పుడు వెస్ట్‌మిన్‌స్టర్ ట్యూబ్ స్టేషన్‌లో పాపీ డే అప్పీల్‌ కోసం పూలు అమ్మడం చూడటం ఆనందంగా ఉంది." ఎంపీ ఆండ్రూ స్టీఫెన్‌సన్ ట్విట్టర్‌లో రాశారు. ట్విట్టర్‌లో ఓ యూజర్‌.. రిషి సునక్ నుండి ఒక వ్యక్తి పూలు కొనుగోలు చేస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు. "ఉదయం రద్దీ సమయంలో మాతో సేకరించడానికి ఉదారంగా తన సమయాన్ని వెచ్చించినందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు" అని రాయ‌ల్ బ్రిటిష్ లెజియ‌న్ తెలిపింది. ప్రతి సంవత్సరం లండన్ పాపీ డే సందర్భంగా రాయల్ బ్రిటిష్ లెజియన్ 1 మిలియన్ పౌండ్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.



Next Story