కొలంబియాలో కొండచరియలు విరిగిపడి 14 మంది దుర్మరణం
Colombia landslide kills at least 14.భారీ వర్షాలు కొలంబియాను అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా
By తోట వంశీ కుమార్ Published on 9 Feb 2022 10:26 AM ISTభారీ వర్షాలు కొలంబియాను అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి సెంట్రల్ కొలంబియాలో 14 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రిసారాల్టా ప్రావిన్సులోని డోస్క్యూబ్రదాస్ మున్సిపాల్టీ పరిధిలో చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగిపడడంతో చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ప్రమాదక స్థాయిలో నదులు ప్రవహిస్తుండడంతో... నది చుట్టు ప్రక్కల ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. నివాస ప్రాంతాలను బురద ముంచెత్తింది. మట్టిలో కూరుకుపోయిన ఫోటోలను అక్కడి అధికారులు విడుల చేశారు.
కొండచరియలు విరిగిపడ్డాయన్న సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, స్థానికులు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 14 మృతదేహాలను వెలికితీశారు. 35 మంది గాయపడగా.. వారందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉండవచ్చు అనే అనుమానంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దీనిపై స్థానిక ట్యాక్సీ డ్రైవర్ ఒకరు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. కొండచరియలు విరిగిపడినప్పుడు చాలా పెద్ద శబ్ధం వినిపించదని చెప్పాడు. వెంటనే మేము అక్కడికి వెళ్లి చూడగా.. ఇళ్లపై బండరాయి పడి ఉంది. ఆ ఇళ్లలో పలువురు చిక్కుకుని ఉన్నారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పాడు.
కాగా.. ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.