న్యూజిలాండ్ ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ప్రమాణ స్వీకారం

Chris Hipkins sworn in as New Zealand PM. న్యూజిలాండ్ 41వ ప్రధానమంత్రిగా క్రిస్ హిప్కిన్స్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

By అంజి  Published on  25 Jan 2023 10:06 AM GMT
న్యూజిలాండ్ ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ప్రమాణ స్వీకారం

న్యూజిలాండ్ 41వ ప్రధానమంత్రిగా క్రిస్ హిప్కిన్స్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అతని కంటే ముందు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన జెసిండా ఆర్డెర్న్ అధికారికంగా ఆమె రాజీనామాను సమర్పించారు. పార్లమెంట్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హిప్‌కిన్స్ అధికారికంగా అత్యున్నత పదవిని చేపట్టగా, కార్మెల్ సెపులోని ఉప ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ప్రధాన మంత్రి హిప్‌కిన్స్ వచ్చే వారం మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు. అగ్ర నాయకత్వ పాత్రతో పాటు, హిప్కిన్స్ స్వయంగా జాతీయ భద్రత, ఇంటెలిజెన్స్ మంత్రిగా ఉంటారు.

ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం క్రిస్ హిప్కిన్స్‌ మాట్లాడారు. దేశాన్ని ఆర్థికంగా పటిష్టంగా ఉంచేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, గృహ ధరల పెరుగుదలతోపాటు శాంతి భద్రతలపై ప్రధానంగా దృష్టి సారిస్తానని తెలిపారు. న్యూజిలాండ్ 2023 సాధారణ ఎన్నికలు అక్టోబర్ 14, 2023న జరగనున్నాయి. కాగా జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్‌లో లేబ‌ర్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన హిప్కిన్స్ కీల‌క పాత్ర పోషించాల్సి ఉంటుంది. మరి హిస్కిన్స్ మరోసారి తన పార్టీని అధికారంలోకి తీసుకొస్తారా? అనేది వేచి చూడాలి..

న్యూజిలాండ్ ప్రధాని పదవికి అనూహ్యంగా జెసిండా ఆర్డ్న్‌న్ రాజీనామా చేయడంతో.. కొత్త ప్రధానిగా క్రిస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. కోవిడ్ సంక్షోభ స‌మ‌యంలో జెసిండా కేబినెట్‌లో హిప్కిన్స్ మంత్రిగా పనిచేశారు. పోలీస్ శాఖ మంత్రిగా కూడా పని చేశారు.ఆ సమయంలో అప్పుడు ఆయ‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. వాటర్లూ ప్రైమరీ స్కూల్ ఇంటర్ చదివిన క్రిస్ విక్టోరియా యూనివర్శిటీ ఆఫ్ వెల్లింగ్టన్‌లో అండర్ గ్రాడ్యుయేట్ చదివారు. విక్టోరియా యూనివర్శిటీలో స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా గెలిచి పలు కార్యక్రమాలు నిర్వహించారు.

Next Story