ఇదెక్కడి విచిత్రం.. దగ్గితేనే విరిగిన పక్కటెముకలు..!
Chinese Woman Fractures 4 Ribs While Coughing.ఓ మహిళ దగ్గడంతో ఆమె పక్కటెముకలు విరిగిపోయాయి.
By తోట వంశీ కుమార్ Published on 8 Dec 2022 2:58 AM GMTఓ మహిళ దగ్గడంతో ఆమె పక్కటెముకలు విరిగిపోయాయి. కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తున్నప్పటికి నిజంగా ఈ ఘటన జరిగింది. ఇది మనదేశంలో జరగలేదు. పక్కనే ఉన్న చైనా దేశంలో జరిగింది.
హువాంగ్ అనే ఇంటిపేరు గల షాంఘై పట్టణానికి చెందిన ఓ మహిళ ఇటీవల స్పైసీ పుడ్ తిన్నది. ఆ పుడ్ తిన్నప్పటి నుంచి ఆమెకు దగ్గు పట్టుకుంది. ఆమె దగ్గుతున్న సమయంలో ఆమెకు ఛాతీలో నొప్పిగా అనిపించేది. అయితే.. ఆమె దానిని పెద్దగా పట్టించుకోలేదు. కొద్ది రోజులు గడిచినప్పటికీ కూడా ఆమెకు నొప్పి తగ్గలేదు. పైగా ఆమె శ్వాస తీసుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా నొప్పి వస్తుండడంతో వైద్యుడి వద్దకు వెళ్లింది.
వైద్యులు ఆమెకు సీటీ స్కాన్ చేశారు. ఆమె ఛాతీలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయినట్లు గుర్తించారు. దగ్గితేనే పక్కటెముకలు ఎలా విరిగిపోతాయని హువాంగ్ ఆశ్చర్యపోయింది. ఆమె ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడంతోనే ఇలా జరిగినట్లు వైద్యుడు చెప్పాడు. శరీరంలోని ఎముకలకు ఆధారంగా ఉండే కండరం ఎదగలేదని, ఈ కారణంగానే పక్కటెముకలు విరిగిపోయానన్నాడు.
"మీ పక్కటెముకలు మీ చర్మం కింద స్పష్టంగా కనిపిస్తాయి. ఎముకకు మద్దతు ఇచ్చే కండరం లేదు, కాబట్టి దగ్గినప్పుడు మీ పక్కటెముకలు సులభంగా విరిగిపోతాయి." అని వైద్యుడు చెప్పాడు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆమె నడుము చుట్టూ పట్టి వేశారు. నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుడు సూచించాడు.
దీనిపై హువాంగ్ మాట్లాడుతూ.. గాయం నుంచి కోలుకున్న తరువాత బరువు పెరగడంపై దృష్టి పెడుతానని అన్నారు. వ్యాయామం చేయడంతో పాటు సరైన భోజనం తీసుకోవడం ద్వారా కండరాన్ని పెంచుకుంటానని చెప్పింది.