ఐస్‌క్రీంలో క‌రోనా ఆన‌వాళ్లు..

Chinese city reports coronavirus found on ice cream.చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jan 2021 10:45 AM GMT
coronavirus found on ice cream

చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చైనాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ అక్కడ తయారైన ఐస్‌క్రీమ్‌ల్లోనూ కరోనా ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది. కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలిన ఐస్‌ క్రీం ప్యాకెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అంటూ వాటి జాడ కోసం అధికారులు హైరానా పడుతూ వెతుకుతున్నారు.

చైనాలోని ఉత్తర టియాంజిన్‌ మున్సిపాలిటీలోని ఓ ఫుడ్‌ కంపెనీ త‌యారు చేసిన ఐస్‌క్రీంలో క‌రోనా ఆన‌వాళ్లు క‌నిపించాయి. మొత్తం 4800 ఐస్‌క్రీం బాక్సుల‌ను చైనా అధికారులు గుర్తించారు. దీంతో ఆ సంస్థ ఉత్ప‌త్తి చేసిన వేల కార్ట‌న్ల‌ను సద‌రు సంస్థ వెన‌క్కి తీసుకుంటోంది. ఈ బ్యాచ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 390 కార్ట‌న్ల‌ను మాత్ర‌మే విక్ర‌యించార‌ని.. మ‌రో 29వేల కార్ట‌న్న ఐస్‌క్రీంల‌ను ఇంకా విక్ర‌యించ‌లేద‌ని చైనా అధికారులు గుర్తించారు. దీంతో వాటిని కంపెనీ స్టోర్ రూంలోనే సీల్ వేసి ఉంచారు. ఈ ఐస్‌క్రీం అమ్మ‌కాలు ఎక్క‌డెక్క‌డ జ‌రిగాయి.. వాటిని ఎవ‌రు కొన్నారు తెలుసుకునే పనిలో ప‌డ్డారు అధికారులు.

ఈ ఐస్‌క్రీం వ‌ల్ల ఎవ‌రైనా క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారా..? లేదా..? అనే విష‌యం తెలియ‌లేద‌న్నారు. ఆకంపెనీని తాత్కాలికంగా మూసివేసిన అధికారులు ఉద్యోగులంద‌రికీ వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. దీంతోపాటు ఆ ఐస్‌క్రీం ఫ్యాక్టరీలోని 1,662 మంది ఉద్యోగులను సెల్ఫ్‌ ఐసొలేషన్‌లో ఉండాలని ఆదేశించారు. ఆ కంపెనీ ఐస్‌క్రీం తయారీలో వాడిన పాలపదార్థాలు ఉక్రెయిన్, న్యూజిల్యాండ్‌ నుంచి వచ్చినట్లు గుర్తించారు.


Next Story