చైనా ఎప్పుడు చూసినా పక్క దేశాల మీద పడి ఏడవడమే ఆనవాయితీగా సాగుతూ ఉంటుంది. ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారమే..! ఇప్పటికే టిబెట్ తమదే అని చెప్పుకొంటోంది చైనా.. ఇక తైవాన్ విషయంలో కూడా అలాంటి పోకడలనే అవలంబిస్తూ ఉంది. తైవాన్ కు స్వాతంత్య్రమే లేదని.. ఒకవేళ స్వాతంత్య్రం కావాలని అనుకుంటే అది యుద్ధానికే దారి తీస్తుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేస్తోంది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని చైనా ఎప్పటినుంచో చెబుతోంది. కానీ ఆ దేశ ప్రజలు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.
తైవాన్ పై బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్న చైనా.. ఈ అంశంలో విదేశీ జోక్యం పెచ్చుమీరుతోందంటూ పరోక్షంగా అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ కు స్వాతంత్ర్యం అంటే యుద్ధం తప్పదని చైనా రక్షణ శాఖ ప్రకటన జారీ చేసింది. చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి వు కియాన్ తన ప్రకటనలో తైవాన్ లో కొందరు మాత్రమే స్వాతంత్ర్యం కావాలంటున్నారని, నిప్పుతో చెలగాటం ఆడితే ఆ నిప్పుకే ఆహుతి అయిపోతారని అన్నారు. ఇటీవలే చైనా యుద్ధ విమానాలు తన గగనతలంలోకి వచ్చాయని తైవాన్ ఆరోపించగా, అమెరికాకు చెందిన విమాన వాహక నౌకలు దక్షిణ చైనా సముద్రంలో ప్రవేశించాయి.
తన సార్వభౌమత్వాన్ని సవాలు చేసేందుకు దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు మోహరించిందని చైనా భావిస్తోంది. తైవాన్ అధ్యక్షుడు తై ఇంగ్ వెన్ తమది ఇప్పటికే స్వతంత్ర దేశమని, తమ దేశం పేరు రిపబ్లిక్ ఆఫ్ చైనా అని చెప్తూ ఉండడం చైనాకు నచ్చడం లేదని అంటున్నారు. చైనాకు చెందిన ఫైటర్ జెట్లు ఇటీవలే తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. దీంతో వెంటనే అమెరికా స్పందించింది. ఇదే చైనాకు అసలు నచ్చడం లేదు.