తొలిసారి మ‌నిషికి సోకిన బ‌ర్డ్ ఫ్లూ.. మ‌ళ్లీ చైనాలోనే.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

China reports first human case of H10N3 bird flu.కరోనా మ‌హ‌మ్మారిని ప్రపంచానికి పంచి పెట్టి యావత్ ప్రపంచం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jun 2021 7:31 AM IST
తొలిసారి మ‌నిషికి సోకిన బ‌ర్డ్ ఫ్లూ.. మ‌ళ్లీ చైనాలోనే.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

కరోనా మ‌హ‌మ్మారిని ప్రపంచానికి పంచి పెట్టి యావత్ ప్రపంచం తలకిందులయ్యేలా చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాలోనే మరో వింత కేసు నమోదైంది. ఇప్పటివరకు కోళ్లు, పక్షులకు మాత్రమే వ్యాపించే బర్డ్ ఫ్లూ తొలిసారిగా ఓ వ్య‌క్తికి సోకింది. అది కూడా చైనాలోనే కావ‌డం గ‌మ‌నార్హం. పక్షి జాతిలోనే కనిపించే బర్డ్ ఫ్లూ వైరస్ ఈసారి మనిషికి సోకడం యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. చైనా నేషనల్ హెల్త్ కమిషన్(ఎన్‌హెచ్‌సీ) మంగ‌వారం ఈ విషయాన్ని ప్రకటించింది.

చైనాలోని తూర్పు ప్రావిన్స్‌లోని జెన్‌జియాంగ్‌ నగరానికి చెందిన 41 ఏళ్ల వ్యక్తి.. బర్డ్ ఫ్లూకి కారణమయ్యే హెచ్‌10ఎన్‌3 (H10N3) స్ట్రెయిన్‌‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు వెల్ల‌డించింది. ఆ వ్య‌క్తి ఏప్రిల్ 28న జ్వ‌రం, ఇత‌ర ల‌క్ష‌ణాల‌తో హాస్పిట‌ల్‌లో చేరాడు. ఆ త‌ర్వాత మే 28న అత‌నికి ఈ బ‌ర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ సోకిన‌ట్లు తేలింది. అయితే.. అత‌డికి ఆ వైర‌స్ అత‌డికి ఎలా సోకిందో మాత్రం ఎన్‌హెచ్‌సీ చెప్ప‌లేదు. బ‌ర్డ్‌ఫ్లూ స్ట్రెయిన్‌ల‌లో చాలా త‌క్కువ తీవ్రత ఉన్న‌ది ఇదే.

ఇది పెద్ద ఎత్తున మ‌నుషుల‌కు సోకే అవ‌కాశాలు చాలా చాలా త‌క్కువ‌ని ఎన్‌హెచ్‌సీ తెలిపింది. ఆ వ్య‌క్తి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ద‌ని, త్వ‌ర‌లోనే డిశ్చార్జ్ చేస్తార‌ని చెప్పింది. అత‌ని సన్నిహితుల‌ను కూడా ప‌రీక్షించినా ఈ ఫ్లూ ఆన‌వాళ్లు క‌నిపించ‌లేద‌ని తెలిపింది. చైనా తెచ్చిన కరోనా వైరస్ కష్టాల నుంచి ప్రపంచ దేశాలు ఇంకా తేరుకోకముందే జరిగిన ఈ ఘటన మరోసారి యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.




Next Story