విజృంభిస్తున్న కరోనా.. చైనాలో మళ్లీ లాక్‌డౌన్
China locks down Lanzhou.కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా బావిస్తున్న చైనాలో మరోసారి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 26 Oct 2021 3:17 PM ISTకరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా బావిస్తున్న చైనాలో మరోసారి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో ఇప్పటికే స్కూల్స్, పర్యాటక ప్రదేశాలను మూసివేయగా.. తాజాగా 40 లక్షల జనాభా కలిగిన లాన్‌జువో సిటీలో లాక్‌డౌన్ విధించింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకూడని ఆదేశాలు జారీ చేసింది. కేవలం నిత్యావసరాలు, వైద్య చికిత్స కోసమే అనుమతి ఉంటుందని చెప్పింది. నిత్యావసరాలకు కూడా నిర్దేశిత సమయాన్ని నిర్ణయించింది. ఆ సమయంలోనే నిత్యావసరాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా దేశంలో 29 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. లాన్‌జువో నగరంలో 6 కేసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా అన్ని దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాలను వేగవంతం చేశాయి. వైరస్‌తో పాటు జీవించాలని చెబుతున్నాయి కూడా. అయితే.. చైనా మాత్రం పాజిటివ్ కేసులు జీరో( zero covid) లక్ష్యంగా పనిచేస్తోంది. దేశంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా ఉండొద్దు అన్నది చైనా లక్ష్యం. ఆ మేరకు కఠిన చర్యలు తీసుకుంటోంది. ఒక్క కేసు నమోదు అయినా సరే.. ఆ ప్రాంత సరిహద్దులను మూసివేసి.. అక్కడ భారీగా కొవిడ్ పరీక్షలు చేపడుతోంది. వారం వ్యవధిలోనే చైనాలో వందకుపైగా కేసులు రావడంతో చైనా అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ దేశంలో టూరిస్టులపై ఆంక్షలు విధించారు. ఇక వ్యాక్సినేషన్ కూడా శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 200 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు చెబుతున్నారు.