శాశ్వత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా చైనా అడుగులు
China launches first module of new space station.సరికొత్త శాశ్వత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు చైనా తన సన్నాహాలు ముమ్మరం చేసింది.
By తోట వంశీ కుమార్ Published on 30 April 2021 2:48 AM GMTసరికొత్త శాశ్వత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు చైనా తన సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి కీలకమైన రాకెట్‌ను ప్రయోగించింది. సిబ్బందికి నివాసిత గృహాలతో సహా ఉన్న టియాన్‌హే కీ మాడ్యూల్ ను లాంగ్ మార్చ్ -5బి రాకెట్ ద్వారా వెన్చాంగ్ స్పేస్ కేంద్రం నుంచి ప్రయోగించారు.ఇది 2022 నాటికి సిద్ధమవుతుందని చైనా భావిస్తోంది. నిజానికి అంతరిక్ష పరిశోధనల రంగంలో చైనా కాస్త ఆలస్యంగా ప్రవేశించింది. చైనా తొలి వ్యోమగామిని కక్ష్యలోకి తొలి సారి 2003లోనే పంపింది. అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపిన దేశాల్లో సోవియెట్ యూనియన్, అమెరికాల తర్వాత చైనా మూడవ స్థానంలో ఉంది.
ఇప్పటి వరకు చైనా కక్ష్యలోకి రెండు అంతరిక్ష కేంద్రాలను పంపింది. అందులో టియాంగాంగ్ -1, టియాంగాంగ్ -2 ట్రయల్ స్టేషన్లలో వ్యోమగాములకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉండటానికి అనుమతించాయి. ఇప్పుడు కొత్త 66-టన్నుల మల్టీ-మాడ్యూల్ టియాంగాంగ్ స్టేషన్ కనీసం 10 సంవత్సరాలు పని చేసే విధంగా రూపొందించారు. అందులో టియాన్హే కీలకమైనది. ఇది 16.6 మీటర్ల పొడవు , 4.2 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది వ్యోమగాములకు అవసరమైన పవర్, ప్రొపల్షన్, లైఫ్ సపోర్ట్ సాంకేతికతతో పాటు వారు నివసించేందుకు కూడా వీలుంటుంది.
వచ్చే సంవత్సరం ఈ అంతరిక్ష కేంద్రం నిర్మాణం పూర్తయ్యే లోపు ఇలాంటి మరో 10 ప్రయోగాలను చేయడం ద్వారా అవసరమైన అదనపు పరికరాలను కక్ష్యలోకి చేర్చాలని చైనా భావిస్తోంది. ఇది భూమికి 340 - 450 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ లో పరిభ్రమిస్తుంది. ప్రస్తుతం కక్ష్యలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)ను రష్యా, అమెరికా, కెనడా, యూరోప్, జపాన్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో చైనాను చేరనివ్వకుండా నిరోధించారు. అయితే ఐఎస్ఎస్ 2024లో కక్ష్య నుంచి బయటకు వచ్చేస్తుంది. సరిగ్గా అది రిటైర్ అయ్యే సమయానికి, టియాంగోన్గ్ మాత్రమే కక్ష్యలో ఏకైక అంతరిక్ష కేంద్రంగా మిగులుతుందని చైనా భావిస్తోంది.