మన పక్క దేశం చైనాలో ఇప్పుడు మరో వైరస్ కలకలం రేపుతోంది. హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్‌ఎంపీవీ) వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు అక్కడి సోషల్ మీడియాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ సోకి చాలా మంది ఆస్పత్రుల్లో చేరుతున్నట్టు సమాచారం. ఈ వైరస్‌తో పాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్ - 19 వైరస్‌లు కూడా వ్యాపి చెందుతున్నాయని పలువురు పోస్టులు పెడుతున్నారు. హెచ్‌ఎంపీవీ సోకిన వారిలో కొవిడ్ లక్షణాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించినట్టు సమాచారం. వైరస్ వ్యాప్తిని అక్కడి హెల్త్ మినిస్ట్రీ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఓ ఇంటర్నేషన్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించింది. ఐదేళ్ల కిందట కోవిడ్ వ్యాప్తి సమయంలో సరైన చర్యలు తీసుకోకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం.