ప్ర‌జ‌ల‌ను బ‌తిమిలాడుకుంటున్న చైనా.. ముగ్గురు పిల్లలను క‌నాలంటూ..!

China allows three children in major policy shift.ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశం చైనా. జ‌నాభా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jun 2021 7:30 AM IST
ప్ర‌జ‌ల‌ను బ‌తిమిలాడుకుంటున్న చైనా.. ముగ్గురు పిల్లలను క‌నాలంటూ..!

ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశం చైనా. జ‌నాభా పెరుగుద‌ల‌ను నియంత్రించేందుకు ఒక‌ప్పుడు ఇద్ద‌రు వ‌ద్దు ఒక్క‌రే ముద్దు అంటూ ద‌శాబ్దాల‌పాటు ఆ నిబంధ‌న‌ను క‌ఠినంగా అమ‌లు చేసింది. దీంతో చైనాలో జ‌నాభా పెరుగుద‌ల క్షీణించింది. దీని దుష్ఫ‌లితాల‌పై ఆందోళ‌న‌లు వెల్లువెత్త‌డంతో 2016లో ఇద్ద‌రు బిడ్డ‌ల్ని క‌న‌వ‌చ్చునంటూ వెసులుబాటు క‌ల్పించింది. అయితే.. ఆర్థికంగా బారంగా మారుతుండ‌డంతో చాలా మంది ఇద్ద‌రు బిడ్డ‌ల్ని క‌నేందుకు సుమ‌ఖంగా లేరు. దీంతో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇకపై ప్రజలు ముగ్గురు పిల్లల వరకు క‌నేందుకు అనుమ‌తి ఇచ్చింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పార్టీ పొలిట్‌బ్యురో మీటింగ్‌లో ఈమేరకు ఆమోద ముద్ర వేశారు.

వన్‌ చైల్డ్ పాలసీని అమలు చేసిన డ్రాగన్‌ కంట్రీ.. ఒకరు వద్దు.. ముగ్గురైనా పర్లేదు అంటోంది. అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ముగ్గురు పిల్లలకు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొత్త గ‌ణాంకాల ప్ర‌కారం వ‌రుస‌గా నాలుగో ఏడాది కూడా జ‌న‌నాల రేటు అతి త‌క్కువ‌గా న‌మోదైంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా.. రెండోఅతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలో పనిచేయగలిగే వారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుండటంపై ప్రభుత్వ వర్గాల్లో ఆందోళనలు వ్యక్తం అవుతోంది. పరిస్థితి ఇలానే ఉంటే దేశ రక్షణకు అవసరమైన సైనికులూ భవిష్యత్తులో దొరకరంటూ సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా అత్యధిక ఆదాయం ఉన్న కుటుంబాలు ముగ్గురు పిల్లలు వరకు కనాలని సూచించింది.

Next Story