చిన్మయ్ దాస్‌తో సహా వందలాది మంది హిందువులపై కేసులు పెట్టిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మొదట హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు చేసి ఇప్పుడు ప్రత్యక్షంగా వారిని వేధింపులకు గురిచేస్తోంది.
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 5:14 AM GMTబంగ్లాదేశ్ మొదట హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు చేసి ఇప్పుడు ప్రత్యక్షంగా వారిని వేధింపులకు గురిచేస్తోంది. బంగ్లాదేశ్‌లో అరెస్టయిన హిందూ పూజారి చిన్మోయ్ దాస్ సహా వందలాది మంది హిందువులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈరోజు బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక ప్రకారం.. చిట్టగాంగ్‌లోని కోర్టు కాంప్లెక్స్ వద్ద పోలీసులు, హిందూ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ అనుచరుల మధ్య ఘర్షణపై ఆదివారం కేసు నమోదైంది.
164 మందిని గుర్తించిన పోలీసులు.. 400 నుండి 500 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో పాటు, దేశద్రోహ ఆరోపణలపై అరెస్టయిన చిన్మోయ్ కృష్ణ దాస్‌ని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చినట్లు నివేదిక పేర్కొంది.
చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మహ్మద్ అబూ బకర్ సిద్ధిఖీ కోర్టులో వ్యాపారవేత్త, బంగ్లాదేశ్ కార్యకర్త హెఫాజాత్-ఎ-ఇస్లాం కార్యకర్త ఇనాముల్ హక్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. నవంబర్ 26న కోర్టు పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా చిన్మోయ్ కృష్ణ దాస్ అనుచరులు తనపై దాడి చేశారని హక్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 'పంజాబీ', కుర్తా, టోపీ ధరించినందుకు తనను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని.. ఫలితంగా అతని కుడి చేయి, తలకు గాయాలయ్యాయని వ్యాపారవేత్త పేర్కొన్నాడు.
భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం బంగ్లాదేశ్‌లో ఒకరోజు పర్యటన చేయనున్నారు. ఈ సందర్భంగా, హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులకు సంబంధించి ఆయన ఢాకాతో భారత్ ఆందోళనలను లేవనెత్తాడు. బంగ్లాదేశ్ తాత్కాలిక విదేశాంగ మంత్రి మహ్మద్ తౌహీద్ హుస్సేన్‌ను కూడా ఆయన కలవనున్నారు.
12 గంటల పర్యటనలో బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్‌ను కూడా మిస్రీ కలిసే అవకాశం ఉంది. ఆగస్టులో ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం పదవీ విరమణ చేసిన తర్వాత భారత్ నుండి అత్యున్నత స్థాయి పర్యటన ఇదే.