క్రాష్ ల్యాండైన కార్గో విమానం.. రెండు ముక్క‌లైంది.. వీడియో

Cargo Plane Splits In 2 After Crash Landing At Costa Rica Airport.ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్ర‌య‌త్నించిన ఓ కార్గో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2022 5:01 AM GMT
క్రాష్ ల్యాండైన కార్గో విమానం.. రెండు ముక్క‌లైంది.. వీడియో

ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్ర‌య‌త్నించిన ఓ కార్గో విమానం క్రాష్ ల్యాండ్ అయింది. రన్‌వేపై నుంచి ప‌క్క‌కు వెళ్లిపోవ‌డంతో పాటు రెండు ముక్కలుగా విడిపోయింది. ఈ ఘ‌ట‌న కోస్టారికాలో చోటు చేసుకుంది. విమానం రెండు ముక్క‌లైన దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

వివ‌రాల్లోకి వెళితే.. జర్మన్‌ లాజిస్టిక్‌ దిగ్గజం డీచ్‌ఎల్‌కు చెందిన బోయింగ్‌ 757 కార్గో విమానం కోస్టారికాలోని సాన్‌ జోస్‌ విమానాశ్రయం నుంచి గురువారం ఉద‌యం 10.30గంట‌ల‌కు బ‌య‌లుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే విమానంలో సాంకేతిక స‌మ‌స్య‌ను గుర్తించారు ఫైలెట్లు. వెంట‌నే అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ కోసం అనుమ‌తి కోరారు. అనుమ‌తి రావ‌డంతో.. టేకాఫ్ అయిన 25 నిమిషాల్లో విమానం ఎయిర్‌పోర్టుకు వెనుదిరిగింది.

రన్‌వేపై దిగుతుండ‌గా.. కొద్దిదూరం వెళ్లిన తర్వాత విమానం ర‌న్ వేపై నుంచి జారి ప‌డింది. వెనుక చ‌క్రాల వ‌ద్ద రెండు ముక్కలుగా విరిగిపోయింది. ద‌ట్ట‌మైన పొగ‌లు వ‌చ్చాయి. అయితే.. అప్ప‌టికే అప్ర‌మ‌త్తంగా ఉన్న ఎయిర్ పోర్టు సిబ్బంది వెంట‌నే మంట‌ల‌ను ఆర్పి వేశారు. ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో ఇద్ద‌రు సిబ్బంది ఉన్నారు. వారిద్ద‌రికి ఎటువంటి గాయాలు కాలేద‌ని అధికారులు తెలిపారు. అయిన‌ప్ప‌టికీ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు వివ‌రించారు. ఈ ఘటనపై దర్యాప్తు ఆదేశించిన‌ట్లు తెలిపారు.

Next Story