కెనడా షూటర్ 18 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ మహిళగా గుర్తింపు
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో నిన్న ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
By - Knakam Karthik |
కెనడా షూటర్ 18 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ మహిళగా గుర్తింపు
టంబ్లర్ రిడ్జ్ : కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో నిన్న ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు పాల్పడింది ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ అని పోలీసులు తాజాగా వెల్లడించారు. కాల్పుల అనంతరం నిందితురాలు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతుల్లో నిందితురాలి కన్నతల్లి, సోదరుడు కూడా ఉండటం గమనార్హం. ఈ కిరాతకానికి వెనుక కుటుంబ కలహాలు, మానసిక అస్థిరత కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 18 ఏళ్ల జెస్సీ వాన్ రూట్‌సెలార్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. ఈమె ఆరేళ్ల క్రితం లింగమార్పిడి చేయించుకుని పురుషుడి నుంచి మహిళగా మారినట్లు అధికారులు ధ్రువీకరించారు. తొలుత ఇంట్లో ఉన్న తన తల్లి, సవతి సోదరుడిని తుపాకీతో కాల్చి చంపింది. ఆ తర్వాత, తాను నాలుగేళ్ల క్రితం చదువు మానేసిన సమీపంలోని హైస్కూల్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఈ బీభత్సంలో ఓ ఉపాధ్యాయురాలితో పాటు, 12 నుంచి 13 ఏళ్ల వయసున్న ఐదుగురు అమాయక విద్యార్థులు (ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందిన కేవలం రెండు నిమిషాల్లోనే తాము పాఠశాలకు చేరుకున్నామని, అప్పటికే లైబ్రరీ, మెట్ల మార్గంలో మృతదేహాలు పడి ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆ దృశ్యాలు హృదయ విదారకంగా ఉందని వారు పేర్కొన్నారు.