అతడు ఉగ్రవాదే..!
కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
By Medi Samrat Published on 30 Dec 2023 10:24 AM ISTకెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 33 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ ఖలిస్తానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బికెఐ)కి చెందినవాడు. 2021లో మొహాలిలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్‌పై రాకెట్ దాడిలో ఇతడు భాగమయ్యాడు. డిసెంబరు 2022లో తార్న్ తరన్‌లోని సర్హాలి పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఆర్‌పిజి దాడికి సంబంధించి లాండా పేరు బయటకు వచ్చింది. పలు ఉగ్రవాద కార్యక్రమాల్లో కూడా లఖ్‌బీర్ సింగ్ లాండా హస్తముంది.
దేశవ్యాప్తంగా పలు ఉగ్రదాడులు, దోపిడీలు, హత్యలు, ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చడం వంటి ఘటనల్లో ప్రమేయం ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అతడు అల్బెర్టాలోని ఎడ్మంటన్‌లో నివసిస్తున్నాడు. ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందినవాడని తెలుస్తోంది. లఖ్‌బీర్ సింగ్ తండ్రి పేరు నిరంజన్ సింగ్, తల్లి పేరు పర్మీందర్ కౌర్. పంజాబ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు సరిహద్దు అవతల నుంచి పేలుడు పదార్థాలు, అధునాతన ఆయుధాలను సరఫరా చేయడంలో అతడి హస్తం ఉందని తేలింది. ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చడం వంటి ఘటనల్లో లఖ్‌బీర్ సింగ్ లాండాపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది. లాండా, అతడి అనుచరులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో హత్యలు, దోపీడీలతోపాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని కేంద్ర హోంశాఖ పేర్కొంది.