కాలిఫోర్నియాలో భారీ కార్చిచ్చు.. 8 నెల‌ల త‌రువాత తెలిసిన షాకింగ్ నిజం

Californian wildfire was started to cover up murder.ఒక తప్పు.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 May 2021 7:00 AM GMT
కాలిఫోర్నియాలో భారీ కార్చిచ్చు.. 8 నెల‌ల త‌రువాత తెలిసిన షాకింగ్ నిజం

ఒక తప్పు.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు.. కానీ ఫలితం దావానలంగా మారింది.. వందలాది భవనాలు కాలి బూడిదయ్యాయి, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. గతేడాది ఆగస్టులో అమెరికాలో కాలిఫోర్నియా భారీ కార్చిచ్చు సంభవించిన విషయం తెలిసిందే. ఆ అగ్నికీలల్లో వేల ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే.. ఆ ప్రమాదానికి కారణాలను దర్యాప్తు చేసే క్రమంలో వెలుగుచూసిన నిజాలతో పోలీసులు షాకయ్యారు. ఓ మనిషిని చంపేసి, ఆ హత్యను దాచిపెట్టే ప్రయత్నం.. కార్చిచ్చుకు దారితీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఉత్తర కాలిఫోర్నియాలోని సొలానో కౌంటీలో గల అడవుల్లో గతేడాది ఆగస్టులో మంటలు చెలరేగాయి. అది కాస్తా అడవి మొత్తం వ్యాపించింది. సొలానో కౌంటీలో మొుదలైన మంటలు క్రమక్రమంగా విస్తరించాయి. అదే సమయంలో అడవిలోని కొన్నిచోట్ల పిడుగులు పడటంతో మరిన్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో భారీ కార్చిచ్చు సంభవించింది. కాలిఫోర్నియా చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చుల్లో ఒకటిగా మిగిలింది. మంటల ఉద్ధృతికి వేల సంఖ్యలో భవనాలు కాలిపోయాయి. దాదాపు 3.63లక్షల ఎకరాల్లో చెట్లు బూడిదయ్యాయి.

సుమారు ఐదు లక్షల మంది ఆ ప్రాంతాన్ని వదిలివెళ్లాల్సి వచ్చింది. ముందంతా అక్కడి ప్రజలను ప్రాంతాలకు తరలించడం పైనే పోలీసులు ద్రుష్టి పెట్టారు..తరువాత సొలానో కౌంటీలో మంటలు చెలరేగిన ప్రాంతానికి సమీపంలో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో ఆ మృతదేహం 32ఏళ్ల ప్రిసిల్లా కాస్ట్రోగా తేలింది. అగ్నిప్రమాదానికి రెండు రోజుల ముందు విక్టర్‌ సెరింటినో అనే వ్యక్తితో డేట్‌కు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దీంతో అతడిని అరెస్టు చేశారు. 8 నెలల సుదీర్ఘ దర్యాప్తు ఆధారంగా సెరింటినో తన నేరాన్ని దాచిపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే అడవికి నిప్పుపెట్టాడని అని పోలీసులు తాజాగా ఇచ్చిన ప్రకటనలో వెల్లడించారు.


Next Story