బుల్డోజర్ ఎక్కిన ప్రధాని

By -  Nellutla Kavitha |  Published on  21 April 2022 4:00 PM GMT
బుల్డోజర్ ఎక్కిన ప్రధాని

బుల్డోజర్, ఈ మధ్య కాలంలో ఇంతలా వినిపించిన పదం మరొకటి లేదేమో. ఉత్తరప్రదేశ్ సాధారణ ఎన్నికల్లో వినిపించిన ఈ పదం, ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రతిధ్వనించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి ఓటు వేయకుంటే బుల్డోజర్ లతో వారి ఇళ్లను కూల్చివేసేందుకు సిధ్దం అంటూ జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇక తెలంగాణలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా క్యాంపెయినింగ్ కొనసాగింపుగా బుల్డోజర్ లని ఉపయోగిస్తామని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. తాజాగా ఢిల్లీ లోని జహంగీర్ పూరి లో మున్సిపల్ అధికారులు ఆక్రమణల కూల్చివేత డ్రైవ్ ను బుల్డోజర్ లతో చేపట్టడం పై సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ రోజు మరోసారి బుల్డోజర్ ఇంకోరకంగా వార్తల్లోకి ఎక్కింది.

ప్రధాని బుల్డోజర్ ఎక్కి ఫోటోలకి ఫోజ్ ఇస్తూ సందడి చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ కు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజరాత్ లో కొత్తగా ప్రారంభమైన జెసిబి ఫ్యాక్టరీని సందర్శించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపిందర్ పటేల్ తో కలిసి బుల్డోజర్ ఎక్కిన బోరిస్ జాన్సన్ కొద్దిసేపు దాన్ని ఆపరేట్ చేయడమే కాకుండా బుల్డోజర్ పైనుంచి చేతులు ఊపుతూ, ఫోటోలకి ఫోజులు ఇచ్చి సందడి చేశారు.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ కు రావడం ఇదే ప్రథమం. గతంలోనే రెండుసార్లు భారత్ కు రావాల్సి ఉన్నా కరోనా కారణంగా అది వాయిదా పడింది. రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా మొదటిరోజు గుజరాత్ అహ్మదాబాద్ లో పర్యటించిన బోరిస్ జాన్సన్, రెండోరోజు ఢిల్లీలో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. త్వరలోనే గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని పర్యటన రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రేపు ఢిల్లీలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అవుతున్నారు.

Next Story