కరోనా మహమ్మారిని చాలా లైట్ గా తీసుకుంటూ ఉన్నారు. ఒక్క భారతదేశం మీదనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరింది. మనుషుల బాధ్యతారాహిత్యమే రెండో సారి కరోనా మహమ్మారి విజృంభించడానికి కారణమని కూడా చెబుతూ ఉన్నారు.
కరోనా మహమ్మారి మొదటి వేవ్ లోనే బ్రెజిల్ లో పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. ఇప్పుడు సెకండ్ వేవ్ లో రోజు రోజుకీ వేళల్లో మరణిస్తూ ఉన్నారు. సెకండ్ వేవ్ లో మంగళవారం ఒక్కరోజే బ్రెజిల్‌లో 3,251 మరణాలు సంభవించాయంటే పరిస్థితి ఎంతగా చేయి దాటిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. ఏ దేశంలోనూ ఈ స్థాయిలో మరణాలు లేవని ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల్లో 1021 మంది సావోపోలో నగరానికి చెందిన వారే ఉన్నారు. ఇప్పటివరకు బ్రెజిల్‌లో మూడు లక్షల మంది కరోనా కారణంగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలు సంభవంచిన దేశాల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు బ్రెజిల్ లో నమోదవుతున్న మరణాలు ఆ దేశ అధికారులను, ప్రజలను ఎంతగానో టెన్షన్ పెడుతూ ఉంది.
ఏ మాత్రం మెడికల్ అనుభవం లేని వ్యక్తులు దేశంలో కరోనా పరిస్థితిపై సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారని ప్రజలు, వైద్యులు ఆ దేశ నాయకులను దుయ్యబడుతూ ఉన్నారు. వ్యాక్సినేషన్ కూడా చాలా నిదానంగా జరుగుతూ ఉందని పలువురు ఆరోపిస్తూ ఉన్నారు.