ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. ఓ పాఠశాల వద్ద బాంబు పేలుడుకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 30 మంది చనిపోగా.. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులే ఉన్నారు. ఈ ఘటన అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. అఫ్గాన్‌లో మైనారిటీలైన షియాలు అధికంగా నివసించే ప్రాంతంలో పశ్చిమ కాబుల్‌లోని దష్ట్-ఎ-బార్చి జిల్లా ఒకటి. ఈ జిల్లాలోని ఆల్ షాదా అనే బాలికల పాఠశాలవద్ద శనివారం ఉగ్రవాదులు బాంబు పేలుడుకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది 11– 15 ఏళ్ల మధ్య విధ్యార్థులేనని అధికారులు వెల్లడించారు. అయితే.. పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడిని పాల్పడింది తాము కాదంటూ తాలిబన్లు ప్రకటించారు. మరే ఇతర ఉగ్రసంస్థ ఈ పేలుడుకు ఇంకా బాధ్యత వహించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. చాలా మంది తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కాగా.. మూడు సార్లు పేలుడు శబ్దాలు విన్నానని.. ఓ స్థానికుడు తెలుపగా.. అధికారులు ఈ వాదనను ఖండించారు. రక్తసిక్తమైన పాఠశాల బ్యాగ్‌లు, పుస్తకాలతో ఘటనా స్థలం హృదయ విదారకంగా ఉంది.