అమెరికాలో మంచు తుఫాను బీభత్సం.. 31 మంది మృతి

Bomb Cyclone Frigid Monster Storm Across Us Claims At Least 31 Lives. క్రిస్మస్‌ పండుగ వేళ.. అమెరికా దేశాన్ని మంచు తుఫాను ముంచెత్తింది. ఆర్కిటిక్‌ పేలుడుతో అమెరికాలో

By అంజి  Published on  26 Dec 2022 8:24 AM IST
అమెరికాలో మంచు తుఫాను బీభత్సం.. 31 మంది మృతి

క్రిస్మస్‌ పండుగ వేళ.. అమెరికా దేశాన్ని మంచు తుఫాను ముంచెత్తింది. ఆర్కిటిక్‌ పేలుడుతో అమెరికాలో పరిస్థితులు భీకరంగా మారాయి. 48 రాష్ట్రాలు చలిగాలులతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక ఈస్ట్‌ అమెరికాలో అయితే పరిస్థితి మరింత భయంకరంగా మారింది. మంచు తుఫాన్‌ వల్ల న్యూయార్క్‌ ఒక వార్‌ జోన్‌ను తలపిస్తోంది. మంచు భారీగా పేరుకుపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. యునైటెడ్ స్టేట్స్ అంతటా ఇప్పటివరకు చలి గాలుల వల్ల 31 మందిని చనిపోయారు. మిలియన్ల మంది ప్రజలు ఆదివారం నాడు చలి వాతావరణాన్ని ఎదుర్కొన్నారు.

న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో నగరం దేశంలో అత్యంత దెబ్బతిన్న ప్రాంతం. వేలాది విమానాలు రద్దు చేయబడ్డాయి. తుఫాను మరింత మంది ప్రాణాలను బలిగొనే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. గాలుల ధాటికి చెట్లు, కరెంట్‌ స్తంభాలు నేలకూలాయి. పదివేల ఇళ్లకు, వ్యాపారాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో కొంతమంది నివాసితులు ఇళ్లలో చిక్కుకున్నారు. కెనడా సమీపంలోని గ్రేట్ లేక్స్ నుండి మెక్సికో సరిహద్దు వెంబడి రియో ​​గ్రాండే వరకు విస్తరించి ఉన్న తుఫాను పరిధి చాలా పెద్దది.

అమెరికాలో కరెంట్‌ సరఫరా నిలిచిపోవడంతో 20 లక్షల మందికి పైగా అంధకారంలో చిక్కుకున్నారు. న్యూయార్క్‌లో పరిస్థితి యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోందని గవర్నర్‌ క్యాథీ హోచుల్‌ అన్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనాలు వెళ్లడానికి వీల్లేకుండా పోయిందని చెప్పారు. ఇక బఫెలో లోని కొన్ని ప్రాంతాలలో 2.4 అడుగుల మేర మంచు కురిసిందని, విద్యుత్‌ లేకపోవడంతో ప్రజలు ప్రమాదంలో చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. తుఫాను పరిస్థితుల్లో ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు కోరుతున్నారు.

అమెరికా జనాభాలో సుమారు 60 శాతం మంది శీతాకాలపు వాతావరణ సలహా లేదా హెచ్చరికను ఎదుర్కొన్నారు. రాకీ పర్వతాల తూర్పు నుండి అప్పలాచియన్స్ వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువగా పడిపోయాయని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. బఫెలో నయాగరా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం మంచు మొత్తం 109 సెంటీమీటర్లుగా నమోదైందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. ట్రాకింగ్ సైట్ FlightAware ప్రకారం, ఆదివారం దాదాపు 1,707 దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దు చేయబడ్డాయి.

Next Story