భారత్‌కు బోయింగ్ భారీ సాయం
Boeing announces $10 million package.కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. గత కొద్ది రోజులుగా
By తోట వంశీ కుమార్ Published on 1 May 2021 11:32 AM ISTకరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగుతోంది. దీంతో దాదాపు ఆస్పత్రులన్ని కరోనా రోగులతో నిండిపోతున్నాయి. కొన్ని చోట్ల ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూశాం. దీంతో కరోనా పోరులో భారత్‌ను ఆదుకునేందుకు చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా భారత్‌కు అమెరికాకు చెందిన ఏరోస్పెస్ దిగ్గజ సంస్థ బోయింగ్ అండగా నిలిచింది. భారీ సాయాన్ని ప్రకటించింది. 10 మిలియన్ డాలర్ల అత్యవసర సహాయ ప్యాకేజిని అందించనున్నట్లు ప్రకటించింది.అంటే మన కరెన్సీలో ఏకంగా రూ.74 కోట్లకు పై మాటే.
మహమ్మారిపై పోరాడుతున్న వారికి వైద్య పరికరాలు అందించడం సహా ఇతర కార్యక్రమాలు చేపడుతున్న భారత్లోని సంస్థలకు ఈ సహాయాన్ని అందిస్తామని వెల్లడించింది. అలాగే బోయింగ్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా తమవంతు సాయంగా వ్యక్తిగతంగా విరాళాలు అందించాలని బోయింగ్ సంస్థ సీఈఓ డేవ్ కల్హౌన్ కోరారు. ఉద్యోగి ఇచ్చిన విరాళానికి అంతే మొత్తాన్ని జమ చేసి సహాయంలో సంస్థ కూడా భాగమవుతుందని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో కరోనా వల్ల ఏర్పడిన దయనీయ పరిస్థితుల మార్పునకు ఇది తమ వంతు సాయం అని చెప్పారు. మహమ్మారిని ఎదుర్కొనే ప్రయత్నంలో బోయింగ్ భారతీయ ప్రజలకు సంఘీభావంగా నిలబడడమే కాకుండా.. సమస్య పరిష్కారంలో భాగస్వాములమవుతామని పేర్కొన్నారు.