లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాల పైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన ఫౌండేషన్ సిబ్బందికి క్షమాపణలు చెప్పారు. అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన 'ఎప్‌స్టీన్ ఫైల్స్' ఆధారంగా వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం..బిల్ గేట్స్ మంగళవారం జరిగిన ఒక టౌన్ హాల్ సమావేశంలో తన తప్పులను ఒప్పుకున్నారు. ఎప్‌స్టీన్‌తో పరిచయం వల్ల గేట్స్ ఫౌండేషన్ ప్రతిష్టకు భంగం కలిగిందని, అందుకు తాను విచారిస్తున్నానని తెలిపారు.
ముఖ్యంగా, ఇద్దరు రష్యన్ మహిళలతో తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆ విషయం ఎప్‌స్టీన్‌కు తెలుసని గేట్స్ అంగీకరించారు. అయితే, ఎప్‌స్టీన్ చేసిన నేరాల్లో తనకు ఎలాంటి భాగస్వామ్యం లేదని, తాను చట్టవిరుద్ధంగా ఏమీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఎప్‌స్టీన్ నేర చరిత్ర తెలిసినప్పటికీ, అతనితో సమావేశాలు కొనసాగించడం తన తప్పేనని, తన మాజీ భార్య మెలిండా హెచ్చరించినప్పటికీ తాను వినలేదని ఒప్పుకున్నారు. ఎప్‌స్టీన్‌తో తనకున్న అనుబంధం ఆ నేరగాడి ప్రతిష్టను పెంచుకోవడానికి సహాయపడిందని ఇప్పుడు గ్రహించానని బిల్ గేట్స్ పేర్కొన్నారు.