విడాకులు తీసుకుంటున్న‌ బిల్‌గేట్స్ దంపతులు

Bill gates And Melinda Gates Announce Divorce.మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ తమ వైవాహిక బంధాన్ని ముగించుబోతున్నట్టుగా ఆయన చేసిన ట్వీట్ ఆశ్చర్య పరచింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 May 2021 1:51 AM GMT
bill gates announces divorce

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ చేసిన ఒక ట్వీట్ అందరినీ అవాక్కయ్యేలా చేసింది. తమ వైవాహిక బంధాన్ని ముగించుబోతున్నట్టుగా ఆయన చేసిన ట్వీట్ ఆశ్చర్య పరచింది. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడిగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవటం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది.

పలుమార్లు ఆలోచించి, ఎంతో మథనం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. తమ 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నామని, ఈ కాలంలో ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. తాము విడిపోయినప్పటికీ బిల్‌మెలిందా గేట్స్ ఫౌండేషన్ ఎప్పటికీ కొనసాగుతుందని, ప్రపంచంలోని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా తమ ఫౌండేషన్ కృషి చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు వీలుగా, తమ వ్యక్తిగత ఆకాంక్షలను, విడాకుల నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని ఆశిస్తున్నాం అని ట్విటర్‌లో బిల్‌, మెలిందాలు ప్రకటించారు.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో బిల్‌గేట్స్‌ ఒకరు. గత ఫిబ్రవరి నాటికి ఆయన ఆస్తి 137 బిలియన్‌ డాలర్లు. 2000 సంవత్సరంలో స్థాపించిన బిల్‌-మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటివరకూ వారు 53 బిలియన్‌ డాలర్లను ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేశారు. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ వయసు 65 ఏళ్లు కాగా, మెలిందా వయసు 56 ఏళ్లు. 1994లో వారిద్దరు వివాహ బంధం తో ఒకటయ్యారు.


Next Story